- కొత్త నైపుణ్యాల్లో స్టూడెంట్లకు శిక్షణ ఇస్తాం: శ్రీధర్బాబు
హైదరాబాద్, వెలుగు: ప్రపంచంలోనే అత్యుత్తమ యూనివర్సిటీల సాంకేతిక సహకారంతో మరో 2 నెలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీని ప్రారంభిస్తున్నట్టు ఐటీ మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. సాఫ్ట్ వేర్ రంగంలో పనిచేస్తున్న ఇంజనీర్లు, చదువులు పూర్తి చేస్తున్న విద్యార్థులకు దీని ద్వారా కొత్త నైపుణ్యాల్లో శిక్షణ అందిస్తామని తెలిపారు. సోమవారం ఆయన కోవాసెంట్ ఏఐ ఇన్నొవేషన్ సెంటర్ ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడారు. ప్రస్తుతం 500 మంది ఇంజనీర్లు పనిచేస్తున్న కోవాసెంట్ మరో రెండేండ్లలో 3,000 మంది ప్రతిభావంతులను ఉద్యోగావకాశాలు కల్పిస్తుందని చెప్పారు. అత్యధిక సంఖ్యలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లున్న నగరంగా హైదరాబాద్ అగ్రస్థానంలో నిలిచిం దని చెప్పారు.
“ప్రపంచంలోని దిగ్గజ బ్యాంకింగ్, ఆర్థిక సంస్థలు జీసీసీల ఏర్పాటుకు హైదరాబాద్ ను ఎంచుకున్నాయి. ఇది అత్యంత గర్వించదగ్గ అంశం. లైఫ్ సైన్సెస్ రంగంలో గణనీయ ప్రగతిని సాధించాం. దేశంలో తయారయ్యే వ్యాక్సిన్లలో మూడో వంతు ఇక్కడే తయారవుతున్నాయి” అని శ్రీధర్ బాబు చెప్పారు.
