
హైదరాబాద్, వెలుగు: ప్రస్తుతం ఏఐతో ఉద్యోగాలు పోతున్నా, భవిష్యత్‌లో ఏఐ ఎక్స్పర్టులకు ఎంతో డిమాండ్‌ఉంటుందని నెక్స్ట్ వేవ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ సీఈఓ రాహుల్ అత్తలూరి అన్నారు. చైనాలో జరిగిన ‘యాన్యువల్ మీటింగ్ ఆఫ్ ది న్యూ చాంపియన్స్’ సమావేశంలో ప్రసంగిస్తూ ఈ విషయం చెప్పారు. దీనిని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ నిర్వహించింది.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, “భారతదేశ జనాభాలో 60 శాతం మంది యువతే! ఇది రెండు వైపులా పదును ఉన్న ఖడ్గం లాంటిది. వీరి ప్రతిభను చక్కటి మార్గంలో మలిచితే వరం అవుతుంది. అవకాశాన్ని వదిలేస్తే భారం అవుతుంది. టెక్నాలజీ మార్పుల ప్రభావం ఎప్పుడూ జే అక్షర రూపంలో ఉండే కర్వ్ లాగా ఉంటుంది. ప్రస్తుతం ఉద్యోగాలు కోల్పోతున్న దశలో ఉన్నాం. చాలా కంపెనీలు హైరింగ్‌ను ఆపేశాయి.
కస్టమర్ సపోర్ట్ వంటి ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలు తగ్గిపోతున్నాయి. ఏఐతో పనులు వేగంగా చేసుకుంటున్నాయి. ఇవన్నీ తాత్కాలికంగా జరిగే మార్పులే! రాబోయే మూడు నుంచి ఐదు సంవత్సరాల్లో ఏఐ స్కిల్స్ ఉన్న వారికి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతుంది. జనరేటివ్ ఏఐ వల్ల భారీ స్థాయిలో అవకాశాలు వస్తాయి. దానికి భారత్ సిద్ధంగా ఉండాలి”అని ఆయన అన్నారు.