
న్యూఢిల్లీ, వెలుగు: బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్ రావుపై త్వరలో ప్రజలు తిరగబడి చెప్పులతో కొడ్తారని ఏఐసీసీ చత్తీస్ గడ్ ఇన్చార్జ్ సెక్రటరీ, సీనియర్నేత సంపత్ కుమార్ ఫైర్ అయ్యారు. వరద బాధితులకు సహాయం చేసేందుకు కాంగ్రెస్ సర్కార్, కార్యకర్తలు రేయింబవళ్లు పని చేస్తుంటే.. కేటీఆర్, హరీశ్ రాజకీయ లబ్ధికోసం విచక్షణలేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు.
విపత్తు సమయాల్లో రాజకీయాలు చేస్తూ.. ఫొటోలకు ఫోజులు ఇవ్వడాన్ని తెలంగాణ సమాజం హర్షించదని చెప్పారు. మంగళవారం ఢిల్లీలోని ఏఐసిసి హెడ్ ఆఫీసులో పార్టీ ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో జరిగిన నూతన ఏఐసిసి సెక్రెటరీ, జాయింట్ సెక్రటరీల మీటింగ్ లో సంపత్ పాల్గొన్నారు. అనంతరం ఢిల్లీ తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. విపత్తు నష్టంపై సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోడికి లేఖ రాశారన్నారు.