
- రూ. 20 కోట్ల ఇంటర్నెట్ పరికరాలను రూ.300 కోట్లకు కొన్నరు
- కేటీఆర్ సూచనలతోనే జయేశ్ రంజన్ ముందుండి నడిపించిండు
- ఈడీకి కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ ఫిర్యాదు
హైదరాబాద్, వెలుగు: సెక్రటేరియెట్‌లో రూ.300 కోట్ల కుంభకోణం జరిగిందని కాంగ్రెస్ నేత, ఏఐసీసీ సభ్యుడు బక్క జడ్సన్ ఆరోపించారు. సచివాలయంలో ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్‌కు సంబంధించి స్విచ్చులు, నెట్వర్క్ సెక్యూరిటీ పరికరాల కొనుగోలులో ఈ స్కామ్ జరిగిందన్నారు. రూ.20 కోట్ల విలువైన పరికరాలను రూ.300 కోట్లకు కొనుగోలు చేశారన్నారు. ఈ మేరకు గురువారం ఆయన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి ఫిర్యాదు చేశారు. ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్‌కు ఈ స్కామ్‌లో డైరెక్ట్‌గా సంబంధం ఉందన్నారు.
కేటీఆర్ కనుసన్నల్లోనే ఈ కుంభకోణం జరిగిందన్నారు. తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ (టీఎస్టీఎస్), ఐటీఈ అండ్ సీ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్) డిపార్ట్మెంట్లు కుంభకోణాలకు మారుపేరుగా తయారయ్యాయని మండిపడ్డారు. ఎన్నికల కోసం ప్రభుత్వ ఖజానాను దోచుకుంటున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. రెండు శాఖల్లో జాయింట్ డైరెక్టర్లను కాదని జూనియర్ అధికారులే పరికరాల కొనుగోలులో కీలకంగా వ్యవహరించారన్నారు. గ్లోబల్ టెండర్లు పిలవాలన్న సీవీసీ గైడ్‌లైన్స్‌కు విరుద్ధంగా టెండర్లు పిలిచారని, పెద్ద కంపెనీలను రానివ్వకుండా, ఇన్ఫినెట్ కంప్యూటర్ సొల్యూషన్ అనే చిన్న సంస్థకు ఇచ్చారని మండిపడ్డారు. హెల్త్ డిపార్ట్మెంట్లో భారీ కుంభకోణానికి పాల్పడిన వెంకటేశ్వర్రావు, హెచ్.రావు, రాజేందర్, సత్య అనే అధికారులు నెట్ పరికరాల కొనుగోలులో కీలకపాత్ర పోషించారన్నారు. కాబట్టి, కేటీఆర్ సహా వీళ్లందరిపై చర్యలు తీస్కోవాలని ఫిర్యాదులో కోరారు.