ఏఐసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ రాజేశ్ లిలోతియా విజ్ఞప్తి
హైదరాబాద్, వెలుగు: దళితులు కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని ఏఐసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ రాజేశ్ లిలోతియా విజ్ఞప్తి చేశారు. త్వరలోనే దళిత విద్యార్థులు, మేధావులతో సమావేశమవుతామని, వారి అభిప్రాయాలు తీసుకుంటామని చెప్పారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జనరల్ స్థానాల్లోనూ దళితులకు టికెట్లు ఇచ్చేలా కార్యాచరణ రూపొందిస్తామన్నారు. మంగళవారం గాంధీభవన్‌లో ఎస్సీ విభాగం కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. పీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ ప్రీతమ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో లిలోతియా చీఫ్ గెస్ట్‌గా మాట్లాడారు.
ఎస్సీ సెల్‌లోని సీనియర్ నాయకులకు పీసీసీ కార్యవర్గంలో చోటు కల్పించేందుకు ప్రయత్నిస్తామన్నారు. బుధవారం లీడర్షిప్ డెవలప్మెంట్ మిషన్ కో ఆర్డినేటర్లతో రిజర్వ్డ్ నియోజకవర్గాల పనితీరుపై లిలోతియా చర్చించనున్నారు. అనంతరం గద్దర్ కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించనున్నారు. ఈ సమావేశంలో మహేశ్ కుమార్ గౌడ్, మల్లు రవి, పార్టీ వైస్ ప్రెసిడెంట్ హర్కర వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో నంది ఎల్లయ్య, గద్దర్‌కు నివాళులర్పించారు.
