
తిన్నింటి వాసాలు లెక్కబెట్టే నేత.. ఏఐసీసీ కార్యదర్శి చిన్నారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు
‘పీవీ నరసింహారావుకు కాంగ్రెస్ ఎంతో ప్రాధాన్యమిచ్చింది. ఒక దశలో రాజకీయాలు మనుకొని హైదరాబాద్ వస్తే సోనియా పిలిచి ప్రధానిని చేశారు. కానీ ఆయన మాత్రం పార్టీలోని ఎందరో సీనియర్లను ఎదగకుండా అణగదొక్కారు. తిన్నింటి వాసాలు లెక్కబెట్టే నేత పీవీ’ అని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ మంత్రి చిన్నారెడ్డి బుధవారం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని హోదాలో బాబ్రీ మసీదును కూల్చి పీవీ ఘోర తప్పిదం చేశారని, దీంతో కాంగ్రెస్‌కు మైనార్టీలు దూరమయ్యారన్నారు. అందుకే గాంధీ కుటుంబం ఆయన్ను పక్కనబెట్టిందని చెప్పారు.
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూడా నాగపూర్‌లోని ఆర్‌ఎస్‌ఎస్ సభకెళ్లి భారతరత్న తెచ్చుకున్నారని విమర్శించారు. బాబ్రీని కూల్చినందుకే పీవీని బీజేపీ పొగడుతోందని, ఆ పార్టీకి ప్రయోజనం కలిగే పనులు చేయలేదు గనక మాజీ ప్రధాని మన్మోహన్ పొగడదని దుయ్యబట్టారు. ‘తెలంగాణ మిగులు బడ్జెట్ రాష్ట్రమని సర్కారు చెబుతోంది. పార్లమెంటులో ఆర్థిక మంత్రేమో రాష్ట్రానికి రూ.10 వేల కోట్ల అప్పుందన్నారు. మరి ఆ డబ్బు దేనికి ఖర్చుపెట్టారు’ అని ప్రశ్నించారు. కాళేశ్వరానికి ఎకరాకు రూ.75 వేలు ఖర్చవుతుందని, ప్రాజెక్టుపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఆశ్రమ టీచర్ల జీతాలు పెంచాలి: మానవతారాయ్
‘కొత్త అసెంబ్లీ, సెక్రటేరియట్‌లను తర్వాతనైనా కట్టు కోవచ్చు. ముందు కష్టపడి పని చేసే వారిని గుర్తించి జీతాలు పెంచండి’ అని పీసీసీ ప్రధాన కార్యదర్శి మానవతారాయ్ కోరారు. రాష్ట్రంలోని ఆశ్రమ టీచర్ల జీవితాలు దుర్భరంగా ఉన్నాయని, రూ. 5 వేల జీతం తో వాళ్ల ఇల్లెలా గడుస్తుందని ప్రశ్నించారు. రెగ్యులర్ టీచర్లలానే వీళ్లూ కష్టపడుతున్నారని, వీళ్ల డిమాండ్‌పై ప్రభుత్వం తక్షణమే స్పందించాలన్నారు.