Moeen Ali: 2019లోనే కోహ్లీని తప్పించి అతడికి RCB కెప్టెన్సీ ఇవ్వాలనుకున్నారు: మొయిన్ అలీ

Moeen Ali: 2019లోనే కోహ్లీని తప్పించి అతడికి RCB కెప్టెన్సీ ఇవ్వాలనుకున్నారు: మొయిన్ అలీ

కోహ్లీ ఆర్సీబీ చరిత్రలో అత్యంత అనుభవజ్ఞుడైన కెప్టెన్‌. 36 ఏళ్ల విరాట్.. 143 మ్యాచ్‌లలో  బెంగళూరు జట్టుకు కెప్టెన్సీ చేశాడు. కోహ్లీ  నాయకత్వంలో ఆర్సీబీ 2016 ఐపీఎల్ సీజన్ లో ఫైనల్‌కు చేరుకుంది. ఈ సీజన్ లో కోహ్లీ కెప్టెన్సీతో పాటు బ్యాటర్ గాను పలు రికార్డ్స్ తన ఖాతాలో వేసుకున్నాడు. నాలుగు సెంచరీలతో పాటు మొత్తం 973 పరుగులు చేసి ఒకే సీజన్ ఐపీఎల్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఇప్పటికీ కొనసాగుతున్నాడు. 2013లో ఆర్సీబీ ఫ్రాంచైజీకి కెప్టెన్ బాధ్యతలు స్వీకరించిన కోహ్లీ.. 2021 వరకు మొత్తం 9 సీజన్ ల పాటు కెప్టెన్ గా చేసినా ఆర్సీబీకి టైటిల్ అందించలేకపోయాడు.

2021 లో ఆర్సీబీ కెప్టెన్సీకి కోహ్లీ రాజీనామా చేయడంతో అతడి స్థానంలో ఫాఫ్ డుప్లెసిస్ కు కెప్టెన్సీ గా ప్రకటించారు. అయితే 2019 లోనే కోహ్లీని తప్పించాలని ఆర్సీబి ఫ్రాంచైజీ భావించిందని ఇంగ్లాండ్ క్రికెటర్, మాజీ ఆర్సీబీ ఆల్ రౌండర్ మొయిన్ అలీ ఈ విషయాన్ని వెల్లడించాడు. అంతేకాదు కోహ్లీ స్థానంలో వికెట్ కీపర్ పార్ధీవ్ పటేల్ ను కెప్టెన్ చేయాలని భావించినట్టు అలీ సంచలన విషయాన్ని బయటపెట్టాడు. స్పోర్ట్స్ టాక్‌తో మొయిన్ అలీ మాట్లాడుతూ ఈ విధంగా అన్నాడు. 

"గ్యారీ కిర్‌స్టెన్ ఆర్సీబీకి అదే చివరి సంవత్సరం. కోహ్లీ స్థానంలో పార్థివ్ పటేల్ కొత్త కెప్టెన్ అవుతాడనే చర్చలు ప్రారంభమయ్యాయి. అయితే అది కార్యరూపం దాల్చలేదు. క్రికెటర్‌గా పార్థివ్ తెలివైనవాడు.  పార్ధీవ్ ను కెప్టెన్ గా అనుకున్నప్పటికీ అతన్ని ఎందుకు చేయలేదో నాకు అర్ధం కాలేదు. కెప్టెన్సీ రోల్ కు పార్థివ్ పటేల్ ను పరిగణలోకి తీసుకున్నారనే విషయాన్ని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను". అని ఈ ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ చెప్పుకొచ్చాడు. 

పార్థివ్ పటేల్ చివరిసారిగా 2019లో ఐపీఎల్‌లో ఆడాడు. 139 మ్యాచ్‌ల్లో 2,848 పరుగులు చేసినఈ వికెట్ కీపర్ బ్యాటర్ చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లతో టైటిళ్లు గెలుచుకున్నాడు. మొయిన్ అలీ విషయానికి వస్తే 2018, 2019, 2020 సీజన్లలో ఆర్సీబీ  తరపున ఆడాడు. 2021 వేలానికి ముందు ఆర్సీబీ జట్టు అతన్ని రిలీజ్ చేసింది. బెంగళూరు తరపున ఈ ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ 309 పరుగులు చేసి 10 వికెట్లు పడగొట్టాడు.