వానాకాలంలో పత్తి, కంది పంటల పెంపు లక్ష్యం

వానాకాలంలో  పత్తి, కంది పంటల పెంపు లక్ష్యం

కరీంనగర్, వెలుగు: యాసంగిలో వరి విషయంలో  డైలామాలో  పడ్డ రైతులు  కొందరు  భూములను పడావు పెట్టుకున్నారు. తీరా యాసంగిలో పండిన వడ్లను కాంటాలు పెడుతుంటే వారంతా ప్రభుత్వాల మాటలు నమ్మి మోసపోయామని బాధపడ్డారు.  అయితే ఈసారి అలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వ్యవశాయ శాఖ అధికారులు ముందస్తు ప్లాన్​తో ఉన్నారు.  ప్రత్యేకంగా వానాకాలం ప్రణాళికను  తయారు చేశారు.  ఈసారి పత్తికి రేట్ రావడంతో జిల్లాలో పత్తి సాగు పెంచాలని వ్యవసాయ శాఖ అధికారులు భావిస్తున్నారు. దీనికి తోడు కంది,  కొత్తగా ఆయిల్ పామ్ సాగు పెంచాలని ప్రణాళికలు వేస్తున్నారు. 

జిల్లాలో 3.64లక్షల ఎకరాల్లో సాగు 

కరీంనగర్ జిల్లాలో ఎల్ఎండీ    కాకతీయ కెనాల్  ఉండటంతో   ఇక్కడి రైతులు వరి పంటకే ప్రాధాన్యత ఇస్తారు.   గత సీజన్ నుంచి ప్రత్యమ్నాయ పంటలు సాగు చేసేలా అధికారులు ఫీల్డ్ లెవల్ లో కసరత్తు  చేస్తున్నారు.  జిల్లాలో ఈ వానకాలంలో 2.45 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయనున్నారు. ఇది గతేడాది కంటే 20వేల ఎకరాలు తక్కువ. ఇక మక్కల సాగు సైతం ఈసారి పెంచుతున్నారు. 28వేల ఎకరాల్లో సాగు కానుంది. వీటితో పాటు కంది 3500 ఎకరాల్లో, పెసర్లు 1500 ఎకరాల్లో, పత్తి గతంలో 47వేల ఎకరాల్లో సాగు కాగా.. ఈసారి  57వేల ఎకరాల్లో సాగు చేయాలని భావిస్తున్నారు. మొత్తంగా జిల్లాల్లో అన్ని పంటలు కలిపి    3.64 లక్షల ఎకరాల్లో   సాగు కానున్నాయి. 

పత్తి, పప్పు దినుసులపై ఫోకస్ 

యాసంగి పంటల కోతలు పూర్తవుతుండటంతో వానాకాలం సాగుపై సన్నద్ధం అయ్యేందుకు రైతులు సిద్ధమవుతున్నారు.   ఏటా ఒకే రకమైన పంటలు కాకుండా వేర్వేరు పంటలు సాగు చేయాలని అధికారులు గ్రామాల్లో అవగాహన కల్పిస్తున్నారు.  వరికి బదులుగా ప్రత్యమ్నాయ పంటలు సాగు చేయాలని రైతులకు ప్రొత్సహిస్తున్నారు.  దిగుబడి.. రాబడి ఎక్కువగా  ఉండే పత్తి, మక్కలు, కందులు, పెసర పంటల విస్తీర్ణం పెంచనున్నారు. ఇప్పటికే జిల్లాలో 47వేల ఎకరాల్లో పత్తి సాగవుతుంది. ఈసారి పత్తి రేటు రూ. 12వేలకు చేరిన  సందర్భాలు ఉన్నాయి. రైతులకు మేలు జరుగుతుందనే భావనతో పత్తిని మరో 10వేల ఎకరాల్లో వేయాలని రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. దీనికి తోడు కందులు, పెసర్లు, ఇతర చిరుధాన్యాలు కలిపి సుమారుగా 6400 ఎకరాల్లో వేయనున్నారు. 

ఆయిల్ పామ్ పై...


జిల్లాలో ఈ ఏడాది కొత్తగా రైతులకు ఆయిల్ పామ్  సాగును పరిచయం చేయనున్నారు.  ఆయిల్ పామ్ తో అధిక లాభాలు పొందొచ్చని అధికారులు చెబుతున్నారు.  ముఖ్యంగా ఈ తోటల సాగు  ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఎక్కువగా ఉంది.  ఆయిల్ పామ్ కు  అనుకూలంగా ఉన్న ఇతర ప్రాంతాల్లో  ఆసక్తి ఉన్న రైతులతో ఈ పంట సాగు చేయించేలా అధికారులు చొరవ తీసుకుంటున్నారు. ఇప్పటికే  ఆసక్తి ఉన్న రైతులను ఆయిల్​పామ్​ తోటలను సాగుచేస్తున్న ఆశ్వరావుపేట లాంటి ప్రాంతాలకు క్షేత్ర పర్యటనకు తీసుకెళ్లారు. ఆయిల్​ పామ్​  సాగుచేసే రైతులకు ప్రభుత్వపరంగా  ప్రొత్సాహకాలు  పెంచేలా వ్యవసాయ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.  

10వేల ఎకరాల్లో.. 

పదివేల ఎకరాల్లో ఆయిల్​ పామ్​ సాగుచేసేలా హార్టి కల్చర్   శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు.   చిగురుమామిడి మండల కేంద్రంలో ఆయిల్ పామ్ నర్సరీ పెంచుతున్నారు. మండలాల వారీగా టార్గెట్ పెట్టి ఆయిల్ పామ్ తోటల సాగు పెంచేందుకు రైతులను సిద్ధం చేస్తున్నారు. ఈ జూన్ నుంచి ఇంట్రెస్ట్ ఉన్న రైతుల నుంచి  అప్లికేషన్స్ తీసుకొని, వారికి అవగాహన కల్పిస్తారు.  ఆయిల్ పామ్ తోటలో అంతర పంటగా ఇతర పంటలు వేసుకోవడానికి వీలుగా ఎకరానికి 49 మొక్కలు నాటాలని భావిస్తున్నారు  రైతుల భూములు సిద్ధం చేసుకుని.. డ్రిప్ సౌకర్యం సమకూర్చుకున్న తరవాత జనవరి నుంచి చేలల్లో మొక్కలు నాటుతారు. మొదటి ఏడాది ఒక్కో రైతుకు 20 వేల నుంచి 25 వేల వరకు ఖర్చు అవుతుంది. రెండో ఏడాది ఖర్చు ఇంత ఉండదు.  మూడేండ్ల వరకు కాత రాదు కాబట్టి రైతులకు నష్టం రాకుండా అంతర పంట వేసుకునే వీలుంటుంది.   

పత్తి.. కంది సాగుపై ఫోకస్ 

ఈ ఏడాదిలో వరిసాగు వీలైనంతగా తగ్గించాలని చూస్తున్నం. వీటి స్థానంలో పత్తి, కంది, పెసర్లు సాగు విస్తీర్ణం పెంచుతాం. దీనికి అనుగుణంగా గ్రామాల్లో రైతులతో సమావేశాలు నిర్వహిస్తున్నాం. అవగాహన కల్పిస్తున్నాం. ఈ ఏడాది కొత్తగా ఆయిల్ ఫామ్ 10వేల ఎకరాల్లో సాగవనుంది. 
- వాసిరెడ్డి శ్రీధర్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి, కరీంనగర్