దళిత బంధు లెక్క మైనార్టీ బంధు ఇయ్యాలి: అసదుద్దీన్‌‌ ఒవైసీ

దళిత బంధు లెక్క మైనార్టీ బంధు ఇయ్యాలి: అసదుద్దీన్‌‌ ఒవైసీ
  • ఎంఐఎం చీఫ్​ అసదుద్దీన్ ​డిమాండ్​
  • తెలంగాణపై బీజేపీకి ఎలాంటి విజన్​ లేదని విమర్శ

సదాశివపేట, వెలుగు: దళిత బంధు లెక్కనే రాష్ట్రంలో మైనార్టీ బంధు అమలు చేయాలని ఎంఐఎం జాతీయ అధ్యక్షులు ఎంపీ అసదుద్దీన్‌‌ ఒవైసీ డిమాండ్ చేశారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలోని ముర్షద్ దర్గా ఆవరణలో ఎంఐఎం ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మైనార్టీల సంక్షేమానికి బీఆర్ఎస్​ ప్రభుత్వం సహకరిస్తలేదని ఆరోపించారు. స్టేట్​లో బీజేపీ అధికారంలోకి వస్తే సెక్రటేరియట్ గుమ్మటాలను కూల్చేస్తామని రాష్ట్ర బీజేపీ నాయకులు అనడం ఎంతవరకు సమంజసమని, దమ్ముంటే కూల్చి చూపాలని సవాల్ విసిరారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు మైనార్టీలను ఓటు బ్యాంకులా వాడుకుంటున్నాయే తప్ప వారి సంక్షేమం, అభివృద్ధికి కృషి చేయండం లేదన్నారు.

పాతబస్తీలో కరెంట్ చోరీ అవుతుందని, ఆఫీసర్లపై దాడులకు పాల్పడుతున్నారని ప్రతిపక్షాలు అంటున్నాయని, పాతబస్తీలో మైనార్టీలు ఒక్కరే లేరని, అన్ని వర్గాల, కులాలకు చెందిన ప్రజలు ఉన్నారన్నారు.  కేంద్ర ప్రభుతం ఆర్ఎస్ఎస్​ కనుసన్నల్లో పాలన సాగిస్తున్నదని, మైనార్టీల అభివృద్ధి విషయంలో వివక్ష చూపుతోందని ఆరోపించారు. మైనార్టీలను కనుమరుగు చేసేందుకు బీజేపీ రాజకీయం చేస్తుందని మండిపడ్డారు. తెలంగాణపై ఆ పార్టీకి ఎలాంటి విజన్‌‌ లేదన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు న్యాయం చేయడంపై బీజేపీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం సీలింగ్​ను తొలగించేందుకు రాజ్యాంగ సవరణ తీసుకురావాలని డిమాండ్ చేశారు.