మసాలా ప్యాకెట్లలో రూ.30 లక్షల డ్రగ్స్ స్మగ్లింగ్

మసాలా ప్యాకెట్లలో రూ.30 లక్షల డ్రగ్స్ స్మగ్లింగ్

మసాలా ప్యాకెట్ల మాటున డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్న గ్యాంగ్ గుట్టు రట్టు చేశారు ఎయిర్ కస్టమ్స్ అధికారులు. ఆస్ట్రేలియాకు డ్రగ్స్ ప్యాకెట్లు కొరియర్ చేసిన గ్యాంగ్‌ను చెన్నైలో అరెస్టు చేశారు. దీనికి సంబంధించిన వివరాలను చెన్నై ఎయిర్‌పోర్టు కస్టమ్స్ కమిషనర్ రాజన్ చౌదరి మీడియాకు తెలిపారు. ఓ పార్శిల్‌లో ఆస్ట్రేలియాకు డ్రగ్స్ కొరియర్ చేస్తున్నారని తమకు పక్కా సమాచారం అందిందని, దీంతో కొరియర్ టెర్మినల్‌లో బాక్సులు ఆపి చెక్ చేశామని చెప్పారు. కారం, సాబార్ పొడి, మసాలాలు పార్శిల్ చేస్తున్నట్లు పైన ఉందని, వాటి ఓపెన్ చేస్తే 50, 100 గ్రాముల సైజులో ఆచి మసాలా ప్యాకెట్లు ఉన్నాయని అన్నారు రాజన్. వాటిలో కొన్ని ప్యాకెట్లు సీల్ తీసినట్లుగా కనిపించడంతో ఓపెన్ చేయగా, వాటిలో ప్లాస్టిక్ ప్యాకెట్లలో తెల్లటి పౌడర్ ఉందని చెప్పారు. 37 ప్యాకెట్లలో దాదాపు రూ.30 లక్షల విలువ చేసే సూడోఫెడ్రిన్ డ్రగ్స్ ఉన్నట్లు టెస్టింగ్‌లో తేలిందని, వాటిని సీజ్ చేసి దర్యాప్తు స్టార్ట్ చేశామని తెలిపారు. ఆస్ట్రేలియాలోని న్యూసౌత్ వేల్స్‌కు ఆ పార్శిల్ కొరియర్ చేసి ఉందన్నారు. ఆ స్మగ్లింగ్ చేస్తున్న ముఠాను పట్టుకునేందుకు చేసిన ఇన్వెస్టిగేషన్‌లో మాస్టర్ మైండ్ చెన్నైకి చెందిన సాతిక్ (37) అని తేలిందని రాజన్ చెప్పారు. అతడితో పాటు ఖాన్ (30), ఆంటోనీ (41), సెల్వం అనే మరో ముగ్గురిని అరెస్టు చేశామని తెలిపారు. సాతిక్ ఆ పౌడర్‌ను బెంగళూరులో కొన్నాడని తమ దర్యాప్తులో తేలిందని చెప్పారు. సెల్వం ఆధార్ కార్డులో ఇంటి అడ్రస్ మార్చి ఆస్ట్రేలియాకు పార్శిల్ పంపే ప్లాన్ చేశారని రాజన్ వివరించారు.