ఎయిర్ గన్తో కాల్పులు.. వ్యక్తికి గాయాలు.. ఆటో కిరాయి వివాదమే కారణం

ఎయిర్ గన్తో కాల్పులు.. వ్యక్తికి గాయాలు.. ఆటో కిరాయి వివాదమే కారణం
  • 24 గంటల్లో నిందితులు అరెస్టు

గండిపేట, వెలుగు: ఎయిర్ గన్తో కాల్పులు జరిపిన ఇద్దరిని శంషాబాద్ రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. పశ్చిమ బెంగాల్​కు చెందిన శివశంకర్ దాస్ ఉపాధి కోసం కొన్నేండ్ల కింద సిటీకి వలస వచ్చాడు. పాతబస్తీ ఘాన్సీ బజార్ కోకరవాడిలో నివాసం ఉంటూ చార్మినార్ సమీపంలో గోల్డ్ స్మిత్ గా పనిచేస్తున్నాడు. ఇటీవల శంషాబాద్ మండలం నర్కుడలో ఇంటి స్థలం కొనుగోలు చేసిన శివశంకర్ అక్కడ నిర్మాణాన్ని చేపట్టాడు. బుధవారం రాత్రి నర్కూడ నుంచి తన మేనల్లుడు పింటూ, అతని స్నేహితులతో కలిసి పాతబస్తీకి వెళ్లడానికి ఆటో మాట్లాడుకున్నాడు. 

ఆటో డ్రైవర్ రూ.800 అడగగా, శివశంకర్ రూ.500 ఇస్తానని చెప్పాడు. దీంతో ఆటో వద్దని వెళ్లిపోమని శివశంకర్ చెప్పగానే, ఆటో వెనకాల కూర్చున్న గుర్తుతెలియని వ్యక్తులు శివశంకర్ తో గొడవకు దిగారు. తమ వద్ద ఉన్న  ఎయిర్ గన్​తో శివశంకర్ పై కాల్పులు జరపగా, అతని కడుపులో గాయమైంది. అది చూసి పింటూ అతని స్నేహితులు పారిపోతుండగా, ఆటోలో కొద్ది దూరం వెంబడించి వెళ్లిపోయారు.

అనంతరం ఈ ఘటనపై బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 24 గంటల్లోనే నిందితులైన పసుముల అలియాస్ గుడుల చందు గౌడ్, సహకరించిన తూర్పాటి కృష్ణ అలియాస్ రామును అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి ఎయిర్ గన్, సెల్ ఫోన్‌‌ను స్వాధీనం చేసుకున్నారు.