చైనా గగనతలంలో ఎయిర్ ఇండియా ఫ్లైట్ యూటర్న్.. అమెరికా వెళ్లకుండా ఎందుకు తిరిగొచ్చేసింది?

చైనా గగనతలంలో ఎయిర్ ఇండియా ఫ్లైట్ యూటర్న్.. అమెరికా వెళ్లకుండా ఎందుకు తిరిగొచ్చేసింది?

దేశ రాజధాని ఢిల్లీ నుంచి అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోకు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. దాదాపు 230 మంది ప్రయాణికులతో ప్రయాణిస్తున్న ఈ 'బోయింగ్ 777-300 ER' విమానం.. గాల్లో 8 గంటల పాటు ప్రయాణించిన తర్వాత తిరిగి ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయింది.

ఈ విమానం ఢిల్లీ నుండి టేకాఫ్ అయిన 3 గంటల తర్వాత చైనా గగనతలంలోకి ప్రవేశించింది. ఆ సమయంలో విమానంలో ఒక తీవ్రమైన సాంకేతిక లోపం తలెత్తినట్లు పైలట్లు గుర్తించారు. విమానంలోని ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని.. పైలట్లు చైనా నుండే విమానాన్ని తిరిగి ఢిల్లీకి డైవర్ట్ చేయాలని నిర్ణయించారు. అలా వెనక్కి యూటర్న్ తీసుకుని మరో 4 గంటలకు పైగా ప్రయాణించి మొత్తంగా 8 గంటల పాటు గాల్లోనే ఉన్న ఎయిర్ ఇండియా విమానం చివరికి సేఫ్ గా ఢిల్లీలో ల్యాండ్ అయ్యింది.

ప్రయాణికులు, సిబ్బంది భద్రతకే తాము అత్యంత ప్రాధాన్యత ఇస్తామని ఎయిర్ ఇండియా స్పష్టం చేసింది. సాంకేతిక లోపంపై పూర్తి స్థాయి తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపింది.

విమానం వెనక్కి వచ్చేయడంతో ఇబ్బంది పడ్డ ప్రయాణికుల కోసం ఎయిర్ ఇండియా గ్రౌండ్ స్టాఫ్ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది. ప్రయాణికులకు అవసరమైన ఫుడ్, హోటల్ వసతి కల్పించడంతో పాటు వారి ఇష్టప్రకారం టికెట్లను రీషెడ్యూల్ చేస్తున్నట్లు ఎయిర్ లైన్ ప్రకటించింది. తిరిగి వెనక్కి రావటం ప్రయాణికులను కొంత నిరాశ పరిచినప్పటికీ.. విమానం సురక్షితంగా ల్యాండ్ అవ్వడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.