లంచ్ ​బాక్స్ ​కోసం పైలట్​ గొడవ

లంచ్ ​బాక్స్ ​కోసం పైలట్​ గొడవ

గంటకు పైగా నిలిచిన ఎయిర్​ఇండియా విమానం

న్యూఢిల్లీ: టిఫిన్ బాక్స్​కడిగే విషయంపై పైలట్, ఫ్లైట్ సిబ్బంది మధ్య చిన్నగా మొదలైన వివాదం ఏకంగా ఓ విమానాన్ని గంటసేపు నిలిపేసింది. అంతేనా.. ఇకపై ఎవరూ బాక్స్​లు తీసుకురావొద్దని ఆదేశాలు జారీచేసేదాకా వెళ్లింది. బెంగళూరు–కోల్​కతా ఎయిర్​ఇండియా(ఏఐ) విమానంలో సోమవార ఈ ఘటన చోటుచేసుకుంది.

సోమవారం ఉదయం 11.40 నిమిషాలు.. బెంగళూరు ఎయిర్​పోర్టు రన్​వే పై ఏఐ772 విమానం బయలుదేరేందుకు సిద్ధంగా ఉంది. టేకాఫ్​కు సిద్ధపడుతున్న క్రమంలో పైలట్ ​తన లంచ్​బాక్స్​ను కడగాలని విమాన సిబ్బందికి సూచించారు. దీనిపై పైలట్​కు, సిబ్బందికి మధ్య గొడవ జరిగింది. వాదోపవాదాల నేపథ్యంలో పైలట్​తన డ్యూటీ విషయమే పట్టించుకోలేదు. గాల్లోకి లేవాల్సిన విమానం రన్​వే పైనుంచి కదలకపోవడంతో అధికారులు ఆరా తీయగా ఈ గొడవ బయటికొచ్చింది. దీంతో అధికారులు ఇద్దరినీ మందలించారు. వారిని తప్పించి వేరే ఉద్యోగులతో విమానాన్ని కోల్​కతాకు పంపించారు. ఈ తతంగంతో ఫ్లైట్ 2 గంటలు ఆలస్యంగా బయలుదేరింది. ఈ ఘటనపై విచారణకు ఆదేశించడంతో పాటు, ఇకపై డ్యూటీకి హాజరయ్యే సిబ్బంది లంచ్​ బాక్స్​లు తీసుకురావొద్దని అధికారులు ఆదేశాలు జారీచేశారు. ఈ ఘటనపై డీజీసీఏకు ఫిర్యాదు చేసినట్లు అధికారులు చెప్పారు.