తుఫానులో ఎయిరిండియా ఫ్లైట్ సేఫ్ ల్యాండింగ్

తుఫానులో ఎయిరిండియా ఫ్లైట్ సేఫ్ ల్యాండింగ్

ప్రతికూల వాతావరణంలో ఎయిరిండియా ఫ్లైట్ను సేఫ్ ల్యాండింగ్ చేసిన పైలెట్లను పలువురు ప్రశంసిస్తున్నారు. లండన్ హీత్రూ ఎయిర్పోర్టులో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్గా మారింది. శుక్రవారం ఎయిరిండియాకు చెందిన బోయింగ్ డ్రీమ్లైనర్ ఎయిర్క్రాఫ్ట్ లండన్లోని హీత్రూ ఎయిర్పోర్టుకు చేరుకుంది. అయితే యూనిస్ తుఫాను కారణంగా వాతావరణం ల్యాండింగ్కు అనుకూలించలేదు. బలమైన ఈదురు గాలులకు ఫ్లైట్ అటూ ఇటూ ఊగడం మొదలుపెట్టింది. ప్రతికూల పరిస్థితుల్లోనూ పైలెట్లు అంచిత్ భరద్వాద్, ఆదిత్యరావులు సమయస్ఫూర్తితో వ్యవహరించారు. విమానాన్ని రన్ వేపై సేఫ్గా ల్యాండ్ చేశారు. 

యూనిస్ తుఫాను కారణంగా హీత్రూ ఎయిర్పోర్టులో ల్యాండింగ్కు పలువురు పైలెట్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాతావరణం అనుకూలించక పలు విమానాలు ఎయిర్పోర్టు పరిసర ప్రాంతాల్లోనే ఆకాశంలో చక్కర్లు కొడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎయిరిండియా పైలెట్లు ఫ్లైట్ సేఫ్ ల్యాండ్ చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. బిగ్ జెట్ టీవీ యూట్యూబ్ ఛానెల్లో లైవ్ స్ట్రీమ్ అయిన ఈ వీడియోను చూసిన పలువురు పైలెట్లపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఎయిరిండియా సైతం తమ పైలెట్ల పనితీరును మెచ్చుకుంది.