ఆపరేషన్ సిందూర్, సఫేద్ సాగర్‎‌‌‌లలో కీలకపాత్ర.. కొత్త ఎయిర్ ఫోర్స్ చీఫ్ బ్యాగ్రౌండ్ ఇదే

ఆపరేషన్ సిందూర్, సఫేద్ సాగర్‎‌‌‌లలో కీలకపాత్ర.. కొత్త ఎయిర్ ఫోర్స్ చీఫ్ బ్యాగ్రౌండ్ ఇదే

న్యూఢిల్లీ: భారత వాయుసేన కొత్త చీఫ్‎గా ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్(59) నియమితులయ్యారు. ప్రస్తుత అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్(61) ఈ నెల 31న రిటైర్ కానున్నారు. ప్రస్తుతం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వైస్ చీఫ్‌‌‌‌గా ఉన్న దీక్షిత్ వాయుసేనకు 29వ అధిపతిగా పగ్గాలు చేపట్టనున్నారు. 

కార్గిల్‌‌‌‌ యుద్ధ సమయంలో వాయుసేన చేపట్టిన ఆపరేషన్ సఫేద్ సాగర్, జమ్మూకాశ్మీర్‌‌‌‌‌‌‌‌లో ఇండియన్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ రక్షక్‌‌‌‌, పాక్‌‌‌‌పై గత ఏడాది చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌‌‌‌‌‌‌‌ వంటి కీలక ఆపరేషన్‌‌‌‌లలో ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్ కీలకపాత్ర పోషించారు. 

పశ్చిమ సరిహద్దుల్లో ఫ్రంట్‌‌‌‌లైన్ ఫైటర్ బేస్ అయిన మిరాజ్ 2000 స్క్వాడ్రన్‌‌‌‌కు, ఫైటర్ ట్రైనింగ్ బేస్‌‌‌‌కు నాయకత్వం వహించారు. ఎయిర్ మార్షల్ దీక్షిత్ సేవలతో వాయుసేన ఆపరేషనల్ సామర్థ్యం మరింత బలోపేతం అయిందని కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. 

డిసెంబర్ 9, 1966న జన్మించిన అశుతోష్ దీక్షిత్.. డిసెంబర్ 6, 1986న వాయుసేన ఫైటర్ స్ట్రీమ్‌‌‌‌లో కమిషన్ పొందారు. ఆయన నేషనల్ డిఫెన్స్ అకాడమీ, డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్, నేషనల్ డిఫెన్స్ కాలేజీల పూర్వ విద్యార్థి. ఆయనకు 3,500 గంటలకు పైగా విమానాలు నడిపిన అనుభవం ఉంది. ఆపరేషనల్, ఇన్‌‌‌‌స్ట్రక్షనల్, సీనియర్ కమాండ్ వంటి హోదాల్లో విధులు నిర్వర్తించారు.

విమానాలు నడపడం, పరీక్షించడంలోనూ మేటి.. 

ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్ ఎక్స్‌‌‌‌పెరిమెంటల్ టెస్ట్ పైలట్‌‌‌‌గా, క్వాలిఫైడ్ ఫ్లయింగ్ ఇన్‌‌‌‌స్ట్రక్టర్‌‌‌‌‌‌‌‌గా రెండు వైపులా బాధ్యతలు నిర్వర్తించారు. దీంతో ఫ్రంట్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌లో విమానాలు నడపడం, కొత్త విమానాలను పరీక్షించడంలో ఆరితేరారు. ఐఏఎఫ్ కీలక ఆపరేషనల్ కమాండ్లలో ఒకటైన సెంట్రల్ ఎయిర్ కమాండ్‌‌‌‌కు ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్ -చీఫ్‌‌‌‌గా కూడా పని చేశారు. 

వాయుసేనలో సేవలకు గుర్తింపుగా ఎయిర్ మార్షల్ దీక్షిత్ పలు సైనిక పురస్కారాలు అందుకున్నారు. 2006లో వాయు సేన పతకం, 2011లో విశిష్ట సేవా పతకం అందుకున్నారు. 2023లో అతి విశిష్ట సేవా పతకం, 2026లో అత్యున్నత సైనిక పురస్కారమైన పరమ విశిష్ట సేవా పతకం పొందారు.