ఫ్లైట్ లేట్ లేదా క్యాన్సిల్ అయ్యిందా? ప్రయాణికుడిగా మీ హక్కులు, కంపెన్సేషన్ ఇవే..

ఫ్లైట్ లేట్ లేదా క్యాన్సిల్ అయ్యిందా? ప్రయాణికుడిగా మీ హక్కులు, కంపెన్సేషన్ ఇవే..

ప్రస్తుతం ఉత్తర భారతదేశాన్ని ముఖ్యంగా ఢిల్లీ పరిసర ప్రాంతాలను దట్టమైన పొగమంచు కమ్మేసింది. తక్కువ విజిబిలిటీ కారణంగా వందలాది విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇదే క్రమంలో మరికొన్ని రద్దు అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో విమానాశ్రయాల్లో గంటల తరబడి వేచి ఉండే ప్రయాణికులకు తమకు ఉన్న హక్కుల గురించి అవగాహన ఉండటం చాలా ముఖ్యం. భారత పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్(DGCA) రూల్స్ ప్రకారం ప్రయాణికులకు కలిగే అసౌకర్యానికి విమానయాన సంస్థలు బాధ్యత వహించాల్సి ఉంటుంది.

విమానం ఆలస్యమైతే దక్కే సౌకర్యాలు:
ఒకవేళ మీరు సమయానికి ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని చెక్-ఇన్ పూర్తి చేసిన తర్వాత విమానం ఆలస్యమైతే, ఎయిర్‌లైన్స్ మీకు ఈ సేవలు అందించాలి. విమానం 2 నుండి 4 గంటల మధ్య ఆలస్యమైతే.. వేచి ఉన్న ప్రయాణీకులకు విమానయాన సంస్థ ఉచితంగా అల్పాహారం లేదా భోజనంతో పాటు తాగటానికి పానీయాలు అందించాలి. అలాగే విమానం 6 గంటల కంటే ఎక్కువ ఆలస్యం అయితే.. ప్రయాణీకులకు ప్రత్యామ్నాయ విమానాన్ని ఏర్పాటు చేయాలి లేదా టికెట్ డబ్బును పూర్తిగా రీఫండ్ చేయాలి. రాత్రిపూట విమానం చాలా సేపు ఆలస్యమైతే.. ప్రయాణికులకు హోటల్ వసతితో పాటు విమానాశ్రయం నుంచి అక్కడికి చేరుకునేందుకు ట్రాన్స్‌పోర్ట్ ఉచితంగా కల్పించాల్సిందే.

కంపెన్సేషన్ ఎంత లభిస్తుంది?
విమాన రద్దు లేదా ఆలస్యం విషయంలో DGCA కఠినమైన కంపెన్సేషన్ రూల్స్ రూపొందించింది:
1. విమానం రద్దుపై పూర్తి మెుత్తం రీఫండ్ పొందవచ్చు.
2. విమానం బయలుదేరడానికి ఒక గంట లోపు రద్దు చేయబడితే రూ.5వేల వరకు, అలాగే రెండు గంటల లోపు అయితే రూ.10వేల వరకు పరిహారం ప్రయాణికులకు లభిస్తుంది.
3. కనెక్షన్ ఫ్లైట్ మిస్ అయితే లేదా సమయానికి సమాచారం ఇవ్వకపోతే రూ.5వేల నుంచి రూ.10వేల వరకు పరిహారం డిమాండ్ చేయొచ్చు.
4. ఒకవేళ 24 గంటల కంటే ఎక్కువ ప్రయాణం ఆలస్యమైతే.. రూ.20వేల వరకు పరిహారం కోరవచ్చు.

అయితే ఇక్కడ ఒక మినహాయింపు ఉంది. ఒకవేళ విమాన ఆలస్యానికి కారణం విమానయాన సంస్థ నియంత్రణలో లేని అంశాలు అంటే.. దట్టమైన పొగమంచు వంటి వాతావరణ పరిస్థితులు, ప్రకృతి వైపరీత్యాలు, రాజకీయ అశాంతి అయితే ఎయిర్‌లైన్స్ హోటల్ వసతి లేదా నగదు పరిహారం అందించాల్సిన అవసరం లేదు. కేవలం ఆహారం, పానీయాలతో పాటు టికెట్ రీఫండ్/రీషెడ్యూల్ వంటి ప్రాథమిక సౌకర్యాలు మాత్రమే వర్తిస్తాయి. అంతేకాకుండా ప్రయాణికుల లగేజీ పోయినా లేదా దెబ్బతిన్నా కూడా పరిహారం పొందే హక్కు ఉంది. కాబట్టి ప్రయాణానికి ముందే మీ విమాన స్థితిని తనిఖీ చేసుకోవడం మరియు మీ హక్కులను గుర్తుంచుకోవడం మంచిది.