ఆల్బట్రాస్​ పక్షి స్ఫూర్తిగా రెక్కలాడించే విమానం

ఆల్బట్రాస్​ పక్షి స్ఫూర్తిగా రెక్కలాడించే విమానం

విమానం గాల్లో ఎగురుతోంది అంటే దానికి స్ఫూర్తి పక్షి. కానీ, విమానానికి, పక్షికీ ఒక్కటే తేడా. రెక్కలాడించడం. మరి, విమానం కూడా రెక్కలాడిస్తూ గాలిని చీల్చుతూ వెళితే ఎలా ఉంటుంది? అదే ఆలోచన ఎయిర్​బస్​కు వచ్చింది. ఆ ఆలోచనను ఆచరణలో పెట్టింది. రెక్కలాడించే ఓ చిన్నపాటి విమానాన్ని తయారు చేసింది. దానిపేరు ‘ఆల్బట్రాస్​ వన్​’. దానికీ స్ఫూర్తి ఓ పక్షే. ఆ పక్షి పేరునే విమానానికి పెట్టింది. ప్రస్తుతం ఎయిర్​బస్​ తయారు చేస్తున్న ఏ321 మోడల్​ విమానానికి కొన్ని మార్పులు చేసి ఈ ఆల్బట్రాస్​ విమానాన్ని తయారు చేసింది. అందులో భాగంగా విమానం రెక్కలను కార్బన్​ ఫైబర్​, గ్లాస్​ ఫైబర్​ పాలిమర్లతో తయారు చేశారు. దాని రెక్కల అంచులు కదిలేలా ‘సెమీ ఏరో ఎలాస్టిక్​’ పద్ధతిలో వాటిని రూపొందించారు. ఆకాశంలో గాలి తీవ్రతను బట్టి ఆ రెక్కలాడుతుంటాయి. తద్వారా విమానం టర్బులెన్స్​  (వైబ్రేషన్​) ప్రభావం తగ్గుతుంది. ఈ విమానాన్ని తయారు చేయడానికి దాదాపు 20 నెలల టైం తీసుకుంది ఎయిర్​బస్​. ఇప్పుడు దానిని టెస్ట్​ చేస్తోంది. ఆల్బట్రాస్​ అనేది ఓ సముద్ర పక్షి. ఆకాశంలో గాలి ఎంత వేగంగా వీచినా కొన్ని గంటల పాటు ఎగరగలదు. దాని రెక్కల అంచులను ఆడిస్తూ గాలిలో స్థిరంగా ఎగురుతుంది. దీంతో ఆ సిద్ధాంతాన్నే విమానంపైనా అమలు చేసింది ఎయిర్​బస్​ సంస్థ. అయితే, ఈ కాన్సెప్ట్​ కొత్తదేం కాదని కంపెనీ ఇంజనీర్​ టామ్​ విల్సన్​ చెప్పారు. ఇప్పటికే మిలటరీ జెట్లను ఈ తరహాలో తయారు చేస్తున్నారన్నారు. అయితే, ప్యాసింజర్​ టైప్​ విమానాల్లో మాత్రం ఇదే మొదటిదని చెప్పారు. విమానపు రెక్కల్లోని మూడొంతుల భాగం కదులుతుందని వివరించారు. ఫిబ్రవరిలో మొదటి సారి దానిని టెస్ట్​  చేశామన్నారు. మరిన్ని టెస్టులు చేస్తామని, రెండు ఫ్లైట్​మోడ్​ల పనితీరును పరిశీలిస్తామని వివరించారు. ఎగిరేటప్పుడు రెక్కలు కదిలే భాగం అన్​లాకింగ్, దాని కదలికలను మరింత జాగ్రత్తగా గమనించాల్సి ఉందని చెప్పారు. కాగా, జులై ‘బర్డ్​ ఆఫ్​ ప్రె’ పేరిట ఓ కాన్సెప్ట్​ విమానం నమూనాను ఎయిర్​బస్​ వెల్లడించిన సంగతి తెలిసిందే.