ఎయిర్ పోర్టులా.. చేపల మార్కెట్లా.. తిరనాళ్ల మాదిరి గందరగోళం.. ఎక్కడ చూసినా లగేజీలు

ఎయిర్ పోర్టులా.. చేపల మార్కెట్లా.. తిరనాళ్ల మాదిరి గందరగోళం.. ఎక్కడ చూసినా లగేజీలు

పండుగల సమయంలో బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు ఎలా ఉంటాయో అంతకు మించి తయారైంది ఇండియాలో ఎయిర్ పోర్టుల పరిస్థితి. ఇండిగో సంక్షోభంతో విమానాలు రద్దవడంతో ప్రయాణికులు కిక్కిరిసిపోయారు. వేల సంఖ్యలో బ్యాగులు, సామాన్లతో పడిగాపులు కాస్తున్నారు. పెరుగుతున్న ప్రయాణికుల రద్దీతో ఎయిర్ పోర్టులు చేపల మార్కెట్ల మాదిరిగా తయారయ్యాయి. ఇవి ఎయిర్ పోర్టులా.. చేపల మార్కెట్లా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రయాణికులు.

 ఇండిగో సంక్షోభం కారణంగా విమానాశ్రయాలలో ఉన్న పరిస్థితులపై 1983 వరల్డ్ కప్ విన్నర్, సీనియర్ క్రికెటర్ మదన్ లాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముంబై ఎయిర్ పోర్ట్ చేపల మార్కెట్ లా తయారైంది.. అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఇండిగో ఫ్లైట్స్ రద్దుతో మదన్ లాల్ ముంబై విమానాశ్రయంలో 12 గంటల పాటు చిక్కుకుపోయారు. ఈ పరిస్థితులపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముంబై నుంచి వెళ్లాల్సిన నా ఫ్లైట్ 12 గంటలు ఆలస్యం అయింది. దీని గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. దేశంలో ప్రజల సమస్యలు పట్టించుకునేవారే లేరు. ఎయిర్ పోర్ట్ ఫిష్ మార్కెట్ లా తయారైంది.. అంటూ ఎక్స్ లో ట్వీట్ చేశారు. ఇండిగో ఎయర్ లైన్స్ పై ప్రయాణికులు ఆగ్రహంతో ఉన్న వేళ.. మదన్ లాల్ స్టేట్ మెంట్స్ మరింత ప్రచారంలోకి వచ్చాయి. 

ప్రమాదాలను వివారించే క్రమంలో వారానికి 12 గంటల రెస్టు నిబంధనను సవరించి 48 గంటలకు పెంచింది డీజీసీఏ. అంతే కాకుండా నైట్ టైమ్ ల్యాండింగ్స్ వారానికి  ఆరు రోజులు కాకుండా 2 రోజులు మాత్రమే ఉండేలా నిబంధనలు చేసింది. ఈ నిర్ణయం సిబ్బంది కొరత, ముందస్తు ప్లానింగ్ లేని ఇండిగో పై పడింది. దీంతో శుక్రవారం (డిసెంబర్ 05) దాదాపు వెయ్యి విమానాలు రద్దయ్యాయి. 

ఇండిగో క్షమాపణ:

విమానాల సర్వీసుల్లో జరుగుతున్న అంతరాయానికి క్షమించాలని ప్రయాణికులను ఇండిగో సీఈవో పీటర్ ఎల్బర్స్ కోరారు. ‘‘గత కొన్ని రోజులుగా మేం తీసుకుంటున్న చర్యలతో సమస్య పరిష్కారం కావడం లేదని అర్థమైంది. అందుకే మా సిస్టమ్స్, షెడ్యూల్స్‌‌‌‌ను మొత్తం రీబూట్ చేయాలని నిర్ణయించాం. ఫలితంగానే ఈ రోజు పెద్ద ఎత్తున ఫ్లైట్స్ రద్దయ్యాయి. కానీ రేపటి నుంచి పరిస్థితులు మెరుగుపడతాయి. వెయ్యి లోపు విమానాలు రద్దవుతాయని అంచనా వేస్తున్నాం. ఈ నెల 10 నుంచి 15 మధ్య పరిస్థితులు మళ్లీ సాధారణ స్థితికి వస్తాయని అనుకుంటున్నాం” అని శుక్రవారం వీడియో మెసేజ్‌‌‌‌లో ఆయన పేర్కొన్నారు.