హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ స్కీమ్ ఎత్తివేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కసిరెడ్డి మణికంఠరెడ్డి, పుట్ట లక్ష్మణ్ ఆరోపించారు. జీవో 7 ద్వారా విద్యార్థుల ఖాతాల్లోకే నేరుగా ఫీజులు వేస్తామంటున్న సర్కార్, అవి ఏ నెలలో విడుదల చేస్తారో స్పష్టత ఇవ్వకపోవడం దారుణమన్నారు. ఈ మేరకు ఆదివారం వారు ఒక ప్రకటన రిలీజ్ చేశారు.
గత నాలుగు విద్యా సంవత్సరాలుగా బకాయిలు పెండింగ్‌లో ఉండటంతో కాలేజీల యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని తెలిపారు. దీంతో పేద విద్యార్థులు అప్పులు చేసి మరీ ఫీజులు కట్టాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేట్ కాలేజీలు ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నా ప్రభుత్వం మౌనంగా ఉండటం సరికాదని, వెంటనే పాత బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేయబోయే విధానంపై స్పష్టమైన షెడ్యూల్ ప్రకటించాలని కోరారు.
