
ఖమ్మం కార్పొరేషన్, వెలుగు : ఇంజినీరింగ్ ఫీజుల పెంపు ఆలోచనను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని ఏఐఎస్ఎఫ్ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఇటికాల రామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక ఖమ్మం గిరిప్రసాద్ భవన్ లో జిల్లా అధ్యక్షుడు మడుపల్లి లక్ష్మణ్ అధ్యక్షతన జరిగిన ఆదివారం నిర్వహించిన ఏఐఎస్ఎఫ్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.
2025–26 విద్యా సంవత్సరానికి గాను రాష్ట్ర ప్రభుత్వం పెంచనున్న ఫీజులతో విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారనుందన్నారు. ప్రభుత్వమే ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో ఫీజుల నియంత్రణపై చట్టం చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే రాష్ట్రవాప్తంగా ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి శివ నాయక్, నాయకులు గోపి, ప్రతాప్, రాకేశ్, పవన్, నరేందర్, ప్రసాద్ పాల్గొన్నారు.