ఉన్నత విద్యా మండలిని ముట్టడించిన ఏఐఎస్ఎఫ్

ఉన్నత విద్యా మండలిని ముట్టడించిన ఏఐఎస్ఎఫ్

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కాలేజీల్లో పెంచిన ఫీజులు తగ్గించాలనే డిమాండ్​తో హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్​ను ఏఐఎస్ఎఫ్​ కార్యకర్తలు సోమవారం ముట్టడించారు. ప్రైవేటు కాలేజీల్లో ఫెసిలిటీస్​ లేకున్నా, వాటిలో ఫీజులు పెంచుడేందని ప్రశ్నించారు. హైదరాబాద్​లోని కౌన్సిల్​ ఆఫీస్​కు ర్యాలీగా వచ్చిన కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారంతా గేటు ముందే బైఠాయించారు. సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ లోపలికి వెళ్లేందుకు ప్రయ్నతించగా, పోలీసులు అడ్డుకొని  అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్​ఎఫ్​ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు మణికంఠరెడ్డి, పుట్ట లక్ష్మణ్, జాతీయ ఉపాధ్యక్షుడు శివరామకృష్ణ మాట్లాడారు. ప్రైవేటు కాలేజీలకు ఫీజుల పెంపుపై ఉన్న శ్రద్ధ,  సౌలత్​లు కల్పించడంలో లేదన్నారు.

ప్రభుత్వం అధికారికంగా ఫీజులు నిర్ణయించకపోయినా, కొన్ని కాలేజీలు కోర్టుకు వెళ్ళి వసూలు చేస్తున్నాయని చెప్పారు. అధికారులు నామమాత్రంగా తనిఖీలు చేసి, చేతులు దులుపుకుంటున్నారని, నిబంధనలకు విరుద్ధంగా సీట్లు పెంచుకునేందుకు అవకాశమిస్తున్నారని చెప్పారు. అన్ని ఇంజనీరింగ్ కాలేజీల్లో ఒకేరకమైన ఫీజులను నిర్ణయించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం రిటైర్డ్ ఐఏఎస్​లతో ఓ కమిటీని వేసి, ప్రైవేటు కాలేజీల ఆగడాలను అడ్డుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఏఐఎస్​ఎఫ్ రాష్ట్ర నాయకులు రెహమాన్, కాసోజు నాగజ్యోతి, గ్యార నరేశ్, బరిగల వెంకటేశ్, వెంకటేశ్, శివకుమార్, అన్వర్, పవన్, చైతన్యయాదవ్, క్రాంతిరాజ్ తదితరులున్నారు.