
భారత వెటరన్ ప్లేయర్లు.. టెస్ట్ స్పెషలిస్ట్ అజింక్య రహానే, చతేశ్వర్ పుజారా ఇకపై టీమిండియాలో కనిపించడం కష్టంగానే కనిపిస్తుంది. దశాబ్దకాలంగా భారత టెస్ట్ జట్టులో కీలక పాత్ర పోషించి ద్రావిడ్, లక్ష్మణ్ వారసులుగా పేరు తెచ్చుకున్నారు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ వంటి దేశాలలో భారత్ సాధించిన విజయాల్లో వీరు కీలక పాత్ర పోషించారు. మూడో స్థానంలో పుజారా అడ్డుగోడలా నిలబడితే.. ఐదో స్థానంలో రహానే నిలకడగా రాణించాడు. బాగా ఆడుతూ టెస్టుల్లో వీరి స్థానం సుస్థిరం చేసుకున్నారు.
పుజారా, రహానే లకు ఏడాది కాలంగా గడ్డు కాలం నడుస్తుంది. వీరు ఎంత బాగా ఆడినా సెలక్టర్లు వీరిని పట్టించుకోవడం లేదు. టీమిండియాలోని కాదు దేశవాళీ క్రికెట్ లోనూ వీరికి నిరాశే ఎదురైంది. సెప్టెంబర్‌లో జరగనున్న దులీప్ ట్రోఫీకి 15 మంది సభ్యుల జట్టులో సీనియర్ బ్యాటర్లు అజింక్య రహానె, చతేశ్వర్ పుజారా జట్టులో చోటు దక్కలేదు. వెస్ట్ జోన్ కెప్టెన్‌గా ముంబై ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్ ఎంపికయ్యాడు. 15 మంది సభ్యుల జట్టులో యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్, శ్రేయాస్ అయ్యర్ ఉన్నారు. గత ఏడాది జరిగిన దులీప్ ట్రోఫీలోనూ వీరికి చోటు దక్కలేదు. దీంతో వీరిద్దరూ క్రికెట్ కు గుడ్ బై చెప్పడం ఖాయంగా కనిపిస్తుంది.
Also Read : బ్రూక్, రూట్ భాగస్వామ్యంతో ఓటమి దిశగా టీమిండియా
2023 దక్షిణాఫ్రికా టూర్ లో భాగంగా టెస్టు జట్టు నుంచి ఈ వెటరన్ బ్యాటర్లను సెలక్టర్లు తప్పించిన సంగతి తెలిసిందే. 2020 నుండి పుజారా ఫామ్ దిగజారుతూ వస్తుంది. గత నాలుగేళ్లలో ఈ వెటరన్ ప్లేయర్ 28 టెస్టు మ్యాచ్ లాడితే యావరేజ్ 30 కంటే తక్కువగానే ఉంది. కేవలం ఒకసారి మాత్రమే మూడంకెల స్కోర్ ను చేరుకోగలిగాడు. నిలకడగా రాణించలేకపోవడం పుజారాకు మైనస్ గా మారింది.
రహానే 2022 లో దక్షిణాఫ్రికా సిరీస్ తర్వాత పేలవ ఫామ్ తో టెస్టు జట్టులో స్థానం కోల్పోయాడు. అయితే ఐపీఎల్ లో అద్భుతమైన ప్రదర్శనతో డబ్ల్యూటీసీ ఫైనల్లో చోటు సంపాదించిన రహానే రెండు ఇన్నింగ్స్ ల్లో వరుసగా 89,46 పరుగులు చేశాడు. కెరీర్ గాడిలో పడిందనుకున్న సమయంలో జులైలో విండీస్ టూర్ లో జరిగిన టెస్ట్ సిరీస్ లో దారుణంగా విఫలమవడం రహానేకు ప్రతికూలంగా మారింది.