బీసీసీఐ సంచలన నిర్ణయం.. అజిత్ అగార్కర్ ఔట్: నెక్స్ట్ చీఫ్ సెలెక్టర్ ఎవరంటే?

బీసీసీఐ సంచలన నిర్ణయం.. అజిత్ అగార్కర్ ఔట్: నెక్స్ట్ చీఫ్ సెలెక్టర్ ఎవరంటే?

Ajit Agarkar Chief Selector: భారత మెన్స్ క్రికెట్ జట్టు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ (Ajit Agarkar) పదవీకాలం ముగింపుకు చేరుకోవడంతో బీసీసీఐ (BCCI) కీలక నిర్ణయానికి సిద్ధమైంది. చీఫ్ సెలెక్టర్‌గా అగార్కర్ స్థానంలో కొత్త వారిని నియమించేందుకు బోర్డు వేగంగా అడుగులు వేస్తోంది. అగార్కర్ పదవీకాలం అక్టోబర్ 4వ తేదీతో ముగియనుండగా, ఆయన కాంట్రాక్ట్‌ను పొడిగించే ఆలోచనలో భారత క్రికెట్ బోర్డు లేదు. ఈ వ్యవహారంపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా (Devajit Saikia) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.   

అక్టోబర్ 4 తర్వాతే కీలక నిర్ణయం: 

అజిత్ అగార్కర్ నిష్క్రమణపై వస్తున్న వార్తలపై దేవజిత్ సైకియా మాట్లాడుతూ.. అగార్కర్‌కు సంబంధించినంతవరకు, ఆయన పదవీకాలం అక్టోబర్ 4వ తేదీతో ముగియనుంది. ఖాళీ కానున్న ఆ స్థానంలో ఎవరిని నియమించాలనే దానిపై నిర్ణయం తీసుకునేందుకు మాకు తగినంత సమయం ఉంది. బీసీసీఐ ఏం నిర్ణయం తీసుకున్నా దానిని అధికారికంగా వెల్లడిస్తామని స్పష్టం చేశారు.

రోహిత్ తో విబేధాలే కొంపముంచాయా: 

అజిత్ అగార్కర్ సెలెక్షన్ కమిటీ ఛైర్మన్‌గా తప్పుకోవడానికి భారత మాజీ వన్డే సారథి రోహిత్ శర్మ (Rohit Sharma) భవిష్యత్తుపై వచ్చిన విబేధాలే ప్రధాన కారణమని తెలుస్తోంది. 

* రోహిత్‌ను పక్కన పెట్టే ప్లాన్: 2027 వన్డే ప్రపంచ కప్ నాటికి యశస్వి జైస్వాల్‌కు అవకాశాలు ఇవ్వాలనే ఉద్దేశంతో రోహిత్ శర్మను వన్డే జట్టు నుంచి తప్పించాలని అగార్కర్ భావించాడు.   

* బీసీసీఐ యూ-టర్న్: ఈ వార్తలను బీసీసీఐ ఖండించడమే కాకుండా, సెక్రటరీ దేవజిత్ సైకియా స్వయంగా మీడియా ముందుకు వచ్చి రోహిత్ శర్మకు పూర్తి మద్దతు ప్రకటించారు. రోహిత్ వన్డేల్లో కొనసాగుతాడని స్పష్టం చేశారు.   

* అగార్కర్ అసంతృప్తి: భారత క్రికెట్ బోర్డు తీసుకున్న ఈ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన అజిత్, తన కాంట్రాక్ట్ రెన్యూవల్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి కూడా నిరాకరించినట్లు సమాచారం.

రేసులో పార్థివ్ పటేల్, ప్రజ్ఞాన్ ఓజా: 

అజిత్ అగార్కర్ నిష్క్రమణతో టీమిండియా కొత్త చీఫ్ సెలెక్టర్‌గా ఎవరు బాధ్యతలు చేపడతారనే అంశంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కాగా మాజీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ (Parthiv Patel), మాజీ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా (Pragyan Ojha) పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. వెస్ట్ జోన్ నుంచి నూతన సభ్యుడిని ఎంపిక చేసి లేదా ప్రస్తుత సౌత్ జోన్ సెలెక్టర్ ఓజాను ఛైర్మన్‌గా ప్రమోట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీ20 ప్రపంచ కప్ 2026 విజయంలో కీలక పాత్ర పోషించిన అగార్కర్ ప్యానెల్, రోహిత్ వివాదంతో ఉన్నట్టుండి ముగింపునకు రావడం ఇండియన్ క్రికెట్ డ్రామాను మరో మలుపు తిప్పింది.