IND vs ENG: చివరి మూడు టెస్టులకు బెంగాల్ యువ పేసర్.. ఎవరీ ఆకాష్ దీప్..?

IND vs ENG: చివరి మూడు టెస్టులకు బెంగాల్ యువ పేసర్.. ఎవరీ ఆకాష్ దీప్..?

ఇంగ్లండ్‌తో జరగబోయే చివరి మూడు టెస్టు మ్యాచ్‌లకు భారత జట్టును బీసీసీఐ శనివారం (ఫిబ్రవరి 10) ప్రకటించింది. విరాట్ కోహ్లీ వ్యక్తిగత కారణాల వలన మిగిలిన టెస్టుల నుంచి తప్పుకున్నాడు. మిడిల్ ఆర్డర్ బ్యాటర్ అయ్యర్ గాయం కారణంగా  సెలక్టర్లు పక్కన పెట్టారు. జడేజా, రాహుల్ పూర్తి ఫిట్ నెస్ సాధించకపోయినా ఎంపిక చేసింది. ఇంతమంది స్టార్ ల మధ్య ఒక కొత్త కుర్రాడు జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడనే విషయం ఎవరూ గమనించలేదు. అతడెవరో కాదు బెంగాల్ పేసర్ ఆకాష్ దీప్. 

తొలి రెండు టెస్టులకు ఎంపికైన ఆవేశ ఖాన్ స్థానంలో ఆకాష్ దీప్ కు చోటు దక్కింది. దీంతో తొలిసారి భారత టెస్టు స్క్వాడ్ లో ఈ బెంగాల్ పేసర్ కు అవకాశం దక్కించుకున్నాడు. ఇప్పటికే పరిమిత ఓవర్ల క్రికెట్ లో ఆసియా గేమ్స్, దక్షిణాఫ్రికా టూర్ కు సెలక్ట్ అయ్యాడు. ఈ 27 ఏళ్ళ పేసర్ ఇంగ్లాండ్ ఇంగ్లండ్ లయన్స్‌తో జరిగిన మూడు అనధికారిక టెస్టులలో ఇండియా ఎ జట్టు తరపున తన ప్రదర్శనతో జట్టు మేనేజ్‌మెంట్‌ను ఆకట్టుకున్నాడు. ఆడిన మూడు మ్యాచ్‌లలో 13 వికెట్లు తీసుకొని ఈ సిరీస్‌లో భారత A జట్టు తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. రెండు సార్లు నాలుగు వికెట్లను సాధించాడు. 

ఆకాష్ దీప్ అంతకముందు  రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఐపీఎల్ ఆడాడు. 7 మ్యాచ్ ల్లో 6 వికెట్లు పడగొట్టి పర్వాలేదనిపించాడు. దేశవాళీ క్రికెట్ లో అద్భుతంగా రాణించి 29 మ్యాచ్ ల్లోనే 103 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. వీటిలో 4 సార్లు ఐదు వికెట్ల ఘనత అందుకున్నాడు. ఇప్పటికే భారత టెస్ట్ జట్టులో మరో బెంగాల్ పేసర్ ముఖేష్ కుమార్ ఉన్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ గతంలో బెంగాల్ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించారు.