వైట్​ పేపర్​లో అన్నీ తప్పుడు లెక్కలే : అక్బరుద్దీన్ ఒవైసీ

వైట్​ పేపర్​లో అన్నీ తప్పుడు లెక్కలే : అక్బరుద్దీన్ ఒవైసీ

హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ వేదికగా రాష్ట్రం దివాలా తీసిందని కామెంట్లు చేయడం సరికాదని, దీనికి తాను అంగీకరించబోనని ఎంఐఎం సభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు. రాజకీయాల కోసం తెలంగాణను బద్నాం చేయొద్దని సూచించారు. అప్పులపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయగా.. అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. ‘‘శ్వేత పత్రంలో తప్పుడు లెక్కలు ఇచ్చి అసెంబ్లీని తప్పుదోవ పట్టించిన బ్యూరో క్రాట్లపై చర్యలు తీసుకోవాలి. ఒకే అంశంపై ఒక్కో చోట.. ఒక్కో లెక్కలు ఉన్నాయి. 57 ఏండ్ల ఉమ్మడి రాష్ట్ర బడ్జెట్​లో తెలంగాణ వాటా రూ.11లక్షల కోట్లు అయితే.. తెలంగాణ బడ్జెట్ రూ.12లక్షల కోట్లు అని వైట్​పేపర్ తేల్చింది.

 ఇది తెలంగాణ సాధించిన ప్రగతే కదా..? శ్వేతపత్రంలో అప్పులను ఎక్కువగా చూపించే ప్రయత్నం చేశారు. కర్నాటక రాష్ట్ర బడ్జెట్​పై లెక్కలు కూడా తప్పే’’ అని అక్బరుద్దీన్ అన్నారు. దీనిపై సీఎం రేవంత్​రెడ్డి స్పందిస్తూ.. ‘‘కర్నాటక బడ్జెట్ లెక్కలే పరిగణనలోకి తీసుకున్నాం”అని చెప్పారు. తర్వాత అక్బరుద్దీన్ మాట్లాడారు. ‘‘ప్రభుత్వం అన్నింటికీ ఆర్బీఐ, కాగ్ పేరు చెప్తున్నది. నేను కాగ్ ఆడిట్ రిపోర్ట్ లోని అంశాలను లెవనెత్తితే.. కర్నాటక బడ్జెట్ బుక్ లో నుంచి ఆ లెక్కలు పెట్టామని సీఎం ఎలా చెప్తరు? గత ప్రభుత్వంలో తప్పులేమైనా జరిగితే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలి. అంతేగానీ.. రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతీయొద్దు”అని సూచించారు.