
హైదరాబాద్, వెలుగు: హుస్సేన్‌సాగర్ కట్టమీద ఉన్న మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, మాజీ సీఎం ఎన్టీఆర్ సమాధులను కూల్చేయాలని ఎంఐఎం శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో టీఆర్ఎస్ తోక ఎట్ల తొక్కాలో తమకు బాగా తెలుసని, ప్రభుత్వం మెడలు వంచి డిమాండ్లను సాధించుకుంటామని చెప్పారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ఆయన సుల్తాన్‌నగర్, ఎర్రగడ్డలో ప్రసంగించారు. ‘‘హైదరాబాద్‌లో అక్రమ కట్టడాలు కూల్చేస్తామని టీఆర్ఎస్ ప్రభుత్వం అంటోంది. అట్ల చేస్తే హుస్సేన్ సాగర్ కట్టపై ఉన్న మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, మాజీ సీఎం ఎన్టీఆర్ సమాధులను కూడా కూల్చేయాలి. 4,700 ఎకరాలున్న హుస్సేన్ సాగర్.. ఇప్పుడు 700 ఎకరాలు కూడా లేదు. 4వేల ఎకరాలు ఆక్రమించుకున్నరు. అక్రమ కట్టడాలని చెప్పి పేదల ఇండ్లు తొలగించినట్లే.. ఎన్టీఆర్, పీవీ సమాధులను కూడా కూల్చే ధైర్యం ఉందా? అని నేను సవాల్ చేస్తున్నా” అని ఆయన అన్నారు. టీఆర్‌ఎస్‌కు ఎంఐఎం ఎప్పుడూ తోకపార్టీ కాదన్నారు. పేదలకు డబుల్ బెడ్ ఇండ్లు ఇస్తామని చెప్పి ఇవ్వలేదని, ఇప్పుడు మళ్లీ అవే మాయమాటలు చెబుతోందని మండిపడ్డారు. ‘‘ఎంఐఎంతో పొత్తు లేదని కేటీఆర్ అంటున్నరు. మాకు ఎవరికింద బతకాల్సిన దుస్థితి లేదు. మేము అడుగేస్తే దుమ్ము లేస్తుంది. ప్రభుత్వం మెడలు వంచి డిమాండ్లను సాధించుకుంటం. అసెంబ్లీలో టీఆర్ఎస్ తోక ఎట్ల తొక్కాలో మాకు బాగా తెలుసు” అని అక్బరుద్దీన్ ఒవైసీ హెచ్చరించారు.