గచ్చిబౌలిలో చదువుకుంటుంది.. వీకెండ్ అని అక్క దగ్గరకు వెళ్లి వస్తూ బస్సులో..

గచ్చిబౌలిలో చదువుకుంటుంది.. వీకెండ్ అని అక్క దగ్గరకు వెళ్లి వస్తూ బస్సులో..

సోమవారం ( నవంబర్ 3 ) ఉదయం చేవెళ్ల దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదం పెను విషాదంగా మారింది. తాండూర్ డిపో నుంచి హైదరాబాద్ బయలుదేరిన బస్సు కంకర లోడ్ తో వస్తున్న టిప్పర్ ఢీకొనడంతో 19 మంది మృతి చెందగా.. మరో 20 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో కంకర కింద అమాయకుల బతుకులు కడతేరాయి. హైదరాబాద్ గచ్చిబౌలి నుంచి అక్క దగ్గరకు వెళ్లిన అఖిల తిరిగొస్తుండగా జరిగిన ప్రమాదంలో మృతి చెందిన ఘటన హృదయ విదారకంగా ఉంది. 

గచ్చిబౌలిలో ఉంటూ చదువుకుంటున్న అఖిల శనివారం ( నవంబర్ 1 ) సాయంత్రం తాండూరులోని అక్క ఇంటికి వెళ్ళింది. ఆదివారం కుటుంబంతో ఆనందంగా గడిపిన అఖిల.. సోమవారం ( నవంబర్ 3 ) తెల్లవారుజామున హైదరాబాద్ కి బయలుదేరింది. ఇంతలోనే టిప్పర్ రూపంలో వచ్చిన మృత్యువు ఆమెను కబళించింది. అప్పటిదాకా ఆనందంగా గడిపిన తన చెల్లి అఖిల ఇక లేదని తెలిసి అక్క కన్నీరు మున్నీరవుతున్న తీరు హృదయాన్ని కలిచి వేస్తోంది. సెలవు రోజు ఫ్యామిలీతో గడపడం కోసం వచ్చిన అమ్మాయి ఇలా అర్దాంతరంగా మరణించడంతో అక్క, బావలు శోకసంద్రంలో మునిగిపోయారు.

కంకర లోడుతో వెళుతున్న టిప్పర్ అతి వేగంగా దూసుకొచ్చి ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సును ఢీ కొట్టింది. బస్సు సగ భాగంలోకి టిప్పర్ దూసుకెళ్లడంతో టిప్పర్లో ఉన్న కంకర మొత్తం బస్సులో ఉన్న ప్రయాణికులపై పడింది. ఈ ప్రమాదంలో 19 మంది ప్రయాణికులు చనిపోయారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 72 మంది ప్రయాణికులు ఉన్నారు. చేవెళ్ల మండలం మీర్జాగూడ దగ్గర ఈ ఘోర ప్రమాదం జరిగింది. టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం, అతి వేగం ఇంత మంది ప్రాణాలను పొట్టనపెట్టుకుందని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. చేవెళ్ల-వికారాబాద్ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ జరిగింది.