- దేశంలో విభజన రాజకీయాలు కాదు.. విజన్ రాజకీయాలు రావాలని వ్యాఖ్య
- ఎమ్మెల్యే తలసాని నివాసంలో అఖిలేశ్‌ను కలిసిన బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్
హైదరాబాద్/పద్మారావునగర్, వెలుగు: ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) పేరుతో ఉత్తరప్రదేశ్ లో మళ్లీ గెలిచేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని ఆ రాష్ట్ర మాజీ సీఎం, సమాజ్‌వాది పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం హైదరాబాద్ వచ్చిన అఖిలేశ్..శనివారం తాజ్ కృష్ణలో నిర్వహించిన ‘విజన్ ఇండియా.. ఏఐ సమిట్’ కు చీఫ్‌గెస్ట్‌గా హాజరయ్యారు.
ఏఐని సమాజానికి ఉపయోగపడే రీతిలో వినియోగించాలని.. కానీ, ఈ టెక్నాలజీని ఎక్కువగా చెడుకు వినియోగించడం ఆందోళన కలిగిస్తున్నదన్నారు. ఏఐని చెడు పనులకు వాడుతున్న తీరుపై సీరియస్ గా దృష్టిపెట్టి, నియంత్రించాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర ఎన్నికల సంఘం ఏఐని మంచి పనులకు వాడితే బాగుండేదని పేర్కొన్నారు.
ఈ టెక్నాలజీని ఉపయోగించి ఓటు గల్లంతయిన వారికి ఓటు హక్కు కల్పించాల్సిన ఈసీ.. ఉన్న ఓటర్లను లేకుండా.. లేని ఓటర్లను ఉన్నట్టుగా చూపుతూ మాయ చేస్తున్నదని విమర్శించారు. యూపీలో సమాజ్‌వాది పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏఐని సరైన మార్గంలో వినియోగించి తమ రాష్ట్ర ప్రజలకు మంచి ఫలితాలను అందిస్తానని చెప్పారు. దేశంలో ఇండియా కూటమి కొనసాగుతున్నదని.. తాము అందులోనే ఉంటామని అఖిలేశ్ తెలిపారు.
బీఆర్ఎస్ తో తనది పాత స్నేహమని.. రెండు రోజుల తెలంగాణ టూర్లో తన మిత్రులందరినీ కలిశానని ఆయన చెప్పారు. దేశంలో విభజన రాజకీయాలు నడుస్తున్నాయని, విజన్ రాజకీయాలు రావాల్సిన అవసరం ఉందని అఖిలేశ్అభిప్రాయపడ్డారు.
పార్లమెంట్లో బీసీ రిజర్వేషన్ల బిల్లుపై పోరాడండి: బీసీ సంఘాల విజ్ఞప్తి
పార్లమెంట్ లో బీసీ రిజర్వేషన్ల బిల్లుపై పోరాడాలని సమాజ్ వాదీ పార్టీ చీఫ్, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ ను బీసీ సంఘాల నేతలు కోరారు. శనివారం బంజారాహిల్స్ లో అఖిలేశ్ యాదవ్ ను బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, గుజ్జ కృష్ణ కలిశారు.
దేశవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లపై విధించిన 50 శాతం పరిమితిని ఎత్తివేసేలా కేంద్రంపై ఒత్తిడి పెంచాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్లను 42 శాతం పెంచుతూ చేసిన చట్టాన్ని ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో ఆమోదించేలా సమాజ్ వాదీ పార్టీ తరఫున పార్లమెంటులో పోరాడాలని జాజుల, శ్రీనివాస్ ఆయనను కోరారు.
కాగా, బీసీల డిమాండ్ న్యాయ సమ్మతమైనదని అఖిలేశ్ అన్నారని, తమ పార్టీ తరఫున పార్లమెంట్లో మాట్లాడుతామని, దేశవ్యాప్తంగా జరుగుతున్న బీసీ ఉద్యమంలో సమాజ్ వాదీ పార్టీ కూడా భాగస్వామ్యం అవుతుందని హామీ ఇచ్చారని బీసీ సంఘాల నేతలు తెలిపారు.
తలసాని నివాసానికి అఖిలేశ్ యాదవ్
హైదరాబాద్ పర్యటనలో ఉన్న అఖిలేశ్ యాదవ్ ను మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తన నివాసానికి ఆహ్వానించారు. ఈ మేరకు శనివారం సాయంత్రం అఖిలేశ్.. జూబ్లీహిల్స్ లోని తలసాని ఇంటికి చేరుకున్నారు.
అక్కడ అఖిలేశ్‌కు ఎమ్మెల్యే తలసాని తన సోదరులు, కుటుంబ సభ్యులను పరిచయం చేశారు. అలాగే, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు, పలువురు ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు అఖిలేశ్ యాదవ్ ను కలిసి కాసేపు ముచ్చటించారు.
