సీఎం కేసీఆర్​తో .. అఖిలేశ్​యాదవ్​ భేటీ

సీఎం కేసీఆర్​తో .. అఖిలేశ్​యాదవ్​ భేటీ

హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ ​చీఫ్, సీఎం కేసీఆర్​తో సమాజ్​వాదీ పార్టీ అధ్యక్షుడు, యూపీ మాజీ సీఎం అఖిలేశ్​యాదవ్ ​భేటీ అయ్యారు. సోమవారం మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్​పోర్టుకు చేరుకున్న అఖిలేశ్​కు మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ఘన స్వాగతం పలికారు. కేంద్రంలో బీజేపీని ఓడించేందుకు అందరూ ఐక్యం కావాలని ఎయిర్​పోర్టు బయట అఖిలేశ్​మీడియాతో అన్నారు. ‘‘సబ్​కా లక్ష్య్ ఏక్​హై.. బీజేపీకో హఠానే చహతాహై ఇస్ కేలియే రాస్తా బనారే” అని అఖిలేశ్​అన్నారు. తాను కేసీఆర్​తో చర్చించేందుకు వెళ్తున్నానని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించడమే అందరి లక్ష్యమైనప్పుడు ఇందుకు అందరూ కలవాల్సిన​అవసరం ఉందన్నారు. కాగా, అక్కడి నుంచి ప్రగతి భవన్​కు వెళ్లిన అఖిలేశ్, ఎస్పీ నాయకులను సీఎం కేసీఆర్​ సాదరంగా ఆహ్వానించారు. 

బీఆర్ఎస్, ఎస్పీ నేతలు ప్రగతి భవన్​లోనే లంచ్​ చేశారు. కేసీఆర్, అఖిలేశ్​ భేటీలో జాతీయ రాజకీయాలు, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇటీవల నిర్వహించిన ప్రతిపక్ష పార్టీల సమావేశం, ఎన్సీపీలో చీలిక సహా అనేక అంశాలు చర్చకు వచ్చినట్టు తెలుస్తున్నది. బీహార్​ రాజధాని పాట్నాలో జూన్​లో నిర్వహించిన బీజేపీ యేతర పార్టీల మీటింగ్​కు బీఆర్ఎస్​ను ఆహ్వానించలేదు. సోమవారమే బెంగళూరులో ఈ పార్టీల రెండో మీటింగ్​నిర్వహించాల్సి ఉండగా ఎన్సీపీలో చీలిక కారణంగా సమావేశం వాయిదా పడింది. ఆదివారం ఖమ్మం బహిరంగ సభలో కాంగ్రెస్​ముఖ్యనేత రాహుల్​గాంధీ మాట్లాడుతూ, ప్రతిపక్షాల భేటీకి బీఆర్ఎస్​ను ఆహ్వానిస్తే తాము రాబోమని చెప్పినట్లు ప్రకటించారు. 

బీజేపీకి ‘బీ’ టీమ్​గా పనిచేస్తున్న బీఆర్ఎస్​తో భవిష్యత్తులోనూ కలిసేది లేదని తేల్చిచెప్పారు. కాంగ్రెస్​ముఖ్యనేత రాహుల్ గాంధీ కేసీఆర్, బీఆర్ఎస్​ పార్టీపై కామెంట్స్​చేసిన మరుసటి రోజే హైదరాబాద్​లో అఖిలేశ్​ దిగడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. వీరిద్దరి భేటీలో రాహుల్​గాంధీ వ్యాఖ్యలపైనా చర్చ జరిగినట్టు తెలిసింది. రాహుల్​గాంధీ కూటమికి నాయకత్వం వహించే పక్షంలో తాము కలిసి వచ్చేది లేదని కేసీఆర్​చెప్పినట్టుగా బీఆర్ఎస్​వర్గాలు వెల్లడించాయి.