
ఈ మధ్య కాలంలో ఎద్దులు జనావాసాల్లో, రోడ్లపై బీభత్సం సృష్టించే వీడియోలు సోషల్ మీడియాలో తరుచుగా చూస్తున్నాం. ఎద్దులు రోడ్లపై, వీధుల్లో సృష్టించే రచ్చ అంతాఇంతా కాదు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో రెండు ఎద్దులు నడిరోడ్డుపై పరుగెత్తుతూ కారుపైకి దూకి ధ్వంసం చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఎద్దుల దాడిలో కార్లు, బైకుల అద్దాలు పగిలిపోయాయి. నడిరోడ్డుపై ఎద్దులు పరుగెత్తుతుండటంతో స్థానికులు బెంబెలెత్తిపోయారు. ఎద్దు దాడిలో ఓ బైకర్ కు స్వల్పంగా గాయాలయ్యాయి. ఉత్తరప్రదేశ్లోని అజంగఢ్ జిల్లాలో చోటు చేసుకున్న ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోను సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ శుక్రవారం తన సోషల్ మీడియా బ్లాగ్లో షేర్ చేశారు.
ఉత్తరప్రదేశ్‌లో విచ్చలవిడి పశువుల వల్ల జరిగిన ప్రమాదానికి సంబంధించిన వీడియోను అఖిలేష్ యాదవ్ షేర్ చేయడం ఇదే మొదటిసారి కాదు. ఉత్తరప్రదేశ్‌లో విచ్చలవిడిగా పశువులను వదలడంతో తలెత్తే సమస్యను అఖిలేష్ యాదవ్ తరచుగా లేవనెత్తుతున్నారు. పనిలో పనిగా ఈ సమస్యపూ ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా విమర్శలు చేశారు.
అఖిలేష్ యాదవ్ షేర్ చేసిన వీడియోలో..భారీ ట్రాఫిక్‌లో పగటిపూట రెండు ఎద్దులు రోడ్డు మధ్యలో పరుగెత్తడం కనిపిస్తుంది. ఒక ఎద్దు దూకి కారు మీద పడగా మరో ఎద్దు అది లేవడానికి సహాయం చేస్తుంది. తన వైపు వస్తున్న ఎద్దును చూసి ఓ బైక్ రైడర్ కూడా బైక్ పై నుంచి కిందపడిపోయాడు. బైక్ రైడర్ బైక్‌ను రోడ్డు మధ్యలో వదిలేసి పక్కకు జరిగి పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఎద్దులు బైకర్ తాకి వుండే ప్రాణాలు పోయినా ఆశ్చర్యం లేదు.
విచ్చలవిడి పశువులు తీవ్ర సమస్య
ఉత్తరప్రదేశ్‌లో విచ్చలవిడిగా సంచరించే పశువుల సమస్య తీవ్రంగా ఉంది. రాష్ట్రంలో ట్రాఫిక్ మధ్య ప్రధాన రహదారులపై విచ్చలవిడిగా సంచరిస్తున్న పశువుల కారణంగా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదాలకు కారణం కాకుండా వ్యవసాయ ఉత్పత్తులకు కూడా నష్టం వాటిల్లుతున్నందున రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించాలి అని ..అఖిలేష్ యాదవ్ కౌశంబ్‌లో రోడ్డు మధ్యలో ఎద్దుల పోట్లాట కారణంగా జరిగిన ప్రమాదానికి సంబంధించిన వీడియోను పంచుకున్నారు.