V6 News

అన్నపూర్ణ స్టూడియోను ఫ్యూచర్ సిటీకి తెస్తం: నాగార్జున

 అన్నపూర్ణ స్టూడియోను ఫ్యూచర్ సిటీకి తెస్తం: నాగార్జున

హైదరాబాద్, వెలుగు: అన్నపూర్ణ స్టూడియోను ఫ్యూచర్ సిటీకి తీసుకొస్తామని సినీ నటుడు అక్కినేని నాగార్జున ప్రకటించారు. ఫ్యూచర్ సిటీలో  నిర్వహించిన తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమిట్‌లో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వ విజన్ ఎంతో బాగుందని కొనియాడారు. ఈ ప్రాంతంలో ఫిల్మ్ హబ్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోందని చెప్పారు. అజయ్ దేవ్‌గణ్​లాంటి వాళ్లు ఇక్కడ ఫిల్మ్ సిటీని ఏర్పాటు చేయాలనుకోవడం గొప్ప విషయమని ఆయన పేర్కొన్నారు.

అట్టహాసంగా ‘గాలా’ డిన్నర్

అతిథుల కోసం ప్రశాంతమైన వాతావరణంలో, సంగీత విభావరితో కూడిన గాలా డిన్నర్​ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై మ్యూజికల్ కాన్సెప్ట్స్ ప్రదర్శించారు. ప్రముఖ మ్యూజిక్​ డైరెక్టర్ ఎం.ఎం కీరవాణి పాటలతో అలరించారు. ఇందులో విదేశీ ప్రతినిధులు, దేశీయ ప్రముఖులు, వివిధ కంపెనీల సీఈఓలు పాల్గొన్నారు .

తెలంగాణ రైజింగ్‍పై సరికొత్త పాట

తెలంగాణ రైజింగ్‍ థీమ్‍పై ప్రభుత్వం రూపొందించిన సరికొత్త పాటను ఆవిష్కరించారు. ‘తెలంగాణ రైజింగ్..స్టేట్ ఈజ్ సో షైనింగ్.. ద ఫ్యూచర్ ఈజ్ బిల్డింగ్..’ అంటూ సాగే ఈ పాటలో తెలంగాణ టూరిజం, పరిశ్రలు, భారత్ ఫ్యూచర్ సిటీ, గేట్ వే ఆఫ్ హైదరాబాద్, ఉస్మానియా జనరల్ ఆసుపత్రి, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అంశాలను పొందుపరిచారు.