కరాచీ: టీ20 వరల్డ్ కప్‌లో చెత్తాటతో సూపర్-–8 దశలోనే పాకిస్తాన్ టీమ్ నిష్క్రమించడంపై ఆ దేశ క్రికెట్ బోర్డు (పీసీబీ) తీవ్ర అసహనం వ్యక్తం చేస్తోంది. టోర్నీలో ఇండియా, ఇంగ్లండ్ వంటి కీలక జట్ల చేతిలో ఓడిపోవడమే కాకుండా సెమీఫైనల్ చేరుకోవడంలో విఫలమవ్వడం పట్ల బోర్డుతో పాటు అక్కడి ప్రభుత్వ పెద్దలు కూడా ఆగ్రహంతో ఉన్నారు.
ఈ క్రమంలో ఆటగాళ్ల చెత్తాటకు బాధ్యతగా వాళ్ల జీతాల్లో భారీగా కోత పెట్టడంతో పాటు, జరిమానాలు విధిస్తేనే భవిష్యత్తులో బాధ్యతగా ఆడతారని పీసీబీ భావిస్తోంది. ఒక్కో ప్లేయర్‌పై రూ.50 లక్షల (పాక్ కరెన్సీ) భారీ ఫైన్ వేయాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం దీనిపై తుది నిర్ణయం తీసుకోనప్పటికీ, ఆటగాళ్లకు ఇచ్చే నెలవారీ అలవెన్సులు, ఇతర బోనస్‌లపై మార్పులు చేసే అవకాశం ఉంది. నేషనల్ ప్లేయర్లకు అతిగా మద్దతు ఇవ్వడం వల్ల ఫలితం ఉండటం లేదని గ్రహించిన బోర్డు ఈ కఠిన నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. క్రికెటర్లను ఆర్థికంగా దెబ్బతీయడం ద్వారా వారిపై ఒత్తిడి పెంచాలని పీసీబీ యోచిస్తోంది.
