Nagarjuna : బాక్సాఫీస్ వద్ద'శివ' తాండవం.. రీ-రిలీజ్‌లలో ఆల్-టైమ్ బిగ్గెస్ట్ ఓపెనింగ్!

Nagarjuna : బాక్సాఫీస్ వద్ద'శివ' తాండవం.. రీ-రిలీజ్‌లలో ఆల్-టైమ్ బిగ్గెస్ట్ ఓపెనింగ్!

రామ్ గోపాల్ వర్మ సృష్టించిన టాలీవుడ్ కల్ట్ క్లాసిక్ 'శివ'. అక్కినేని నాగార్జున కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన చిత్రం ఇది.  అన్నపూర్ణ స్టూడియోస్ 50వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని, అత్యంత ఆధునిక సాంకేతికతతో, 4K రిస్టోరేషన్ , డాల్బీ అట్మాస్ సౌండ్ ఫార్మాట్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు మేకర్స్ . నవంబర్ 14, 2025న ప్రపంచవ్యాప్తంగా రీరిలీజ్ అయింది.  బాక్సాఫీస్ వద్ద 'శివ' మరో సారి దూసుకెళ్తోంది. 36 ఏళ్ల తర్వాత రీ-రిలీజ్ అయినప్పటికీ, ఈ చిత్రం సాధించిన వసూళ్లు ట్రేడ్ పండితులను సైతం ఆశ్చర్యపరుస్తున్నాయి.

 బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత..

అన్నపూర్ణ స్టూడియోస్ అధికారికంగా ప్రకటించిన వివరాల ప్రకారం, 'శివ ' రీరిలీజ్ లోనూ కాసుల వర్షం కురిపిస్తోంది.  సినిమా తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.2.5 కోట్ల గ్రాస్ వసూలు చేయగా, కేవలం రెండు రోజుల్లోనే రూ.3.95 కోట్లకు పైగా గ్రాస్ మార్కును దాటింది. అంచనాలను తలదన్నేలా, పాత సినిమాల రీ-రిలీజ్‌లలో నాగార్జున కెరీర్‌లోనే ఇది అతిపెద్ద ఓపెనింగ్‌గా నిలిచింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన కేంద్రాలైన హైదరాబాద్, వైజాగ్, విజయవాడతో పాటు మాస్ సెంటర్‌లలో కూడా ఈ చిత్రానికి కొత్త విడుదలైన సినిమాల కంటే అధిక ఆదరణ దక్కింది.

 

అంతేకాదు, ఈ 'శివ' సంచలనం ఖండాలు దాటింది. విదేశీ మార్కెట్‌లో, ముఖ్యంగా నార్త్ అమెరికాలో 50 వేల డాలర్లకు పైగా వసూలు చేసి, తన రేంజ్‌ను నిరూపించుకుంది. ఓవర్సీస్‌లో విడుదలైన ఈ చిత్రం, అంతర్జాతీయంగా కూడా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించింది.

 సినీ ప్రముఖుల ప్రశంసలు

'శివ 4K' రీ-రిలీజ్‌ను వీక్షించడానికి పూరీ జగన్నాథ్, సందీప్ రెడ్డి వంగా వంటి ప్రముఖ దర్శకులు హాజరై, అప్‌గ్రేడ్ చేసిన వెర్షన్‌ను అద్భుతమని కొనియాడారు. ఈ చిత్రం యొక్క శైలి, కథనం, ఇళయరాజా అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇప్పటికీ తాజాదనాన్ని కలిగి ఉన్నాయని సినీ విమర్శకులు ప్రశంసించారు. ముఖ్యంగా, 'శివ'లో విప్లవాత్మకమైన సైకిల్ చైన్ ఫైట్ సీన్ను థియేటర్‌లో చూసిన అభిమానులు ఉర్రూతలూగారు, పాత రోజులను గుర్తు చేసుకుంటూ, థియేటర్లలో కోలాహలం సృష్టించారు.

 కొత్త సాంకేతికతతో సరికొత్త అనుభూతి

'శివ' రీ-రిలీజ్ వెనుక నాగార్జున ఉన్నారు. ఆయన ఈ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అసలైన కల్ట్‌ను కొత్త తరానికి చూపించాలనే ఉద్దేశంతో, ఈ చిత్రాన్ని 4K వీడియో నాణ్యతతో పాటు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో సంగీతాన్ని ఇంజనీర్ చేసి, డాల్బీ అట్మాస్ సౌండ్‌కు మార్చారు. ఈ ఆధునిక సాంకేతికత కలయిక, ప్రేక్షకులకు 36 ఏళ్లనాటి క్లాసిక్‌ను ఒక కొత్త సినిమా చూసిన అనుభూతిని ఇస్తోంది.'శివ' చిత్రం తెలుగు సినిమా పరిశ్రమలో కొత్త ట్రెండ్‌కు నాంది పలికిన చిత్రంగా, నేటికీ ఆదరణ పొందడం, బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లు సాధించడం, ఆ సినిమా యొక్క శాశ్వత విలువను, నాగార్జున స్టార్‌డమ్‌ను మరోసారి రుజువు చేసింది.

అక్కినేని వెంకట్, యార్లగడ్డ సురేంద్ర కలిసి అన్నపూర్ణ స్టూడియోస్, SS క్రియేషన్స్ బ్యానర్లపై నిర్మించిన ఈ 'శివ ' చిత్రం రామ్ గోపాల్ వర్మకు దర్శకుడిగా తొలి చిత్రం. ఈ మూవీలో శివ (నాగార్జున), ఆశ (అమల) విద్యార్థులుగా నటించిన ఈ సినిమాలో క్యాంపస్ పాలిటిక్స్, హింసను అత్యంత వాస్తవికంగా చూపించి తెలుగు సినిమాకు కొత్త నిర్వచనం ఇచ్చింది. ముఖ్యంగా నాగార్జున కెరీర్‌ను మలుపు తిప్పిన చిత్రంగా 'శివ' నిలిచింది. ఇప్పుడు మరింత కొత్తగా 'శివ' ను రీరిలీజ్ చేశారు.. దీంతో 4K రీ-రిలీజ్ ద్వారా పాత, కొత్త తరాల ప్రేక్షకులు ఈ విప్లవాత్మక క్లాసిక్‌ను బిగ్ స్క్రీన్‌పై చూసే అవకాశం లభించింది.