
సొసైటీ బిల్డింగ్ స్థలంలో అక్రమంగా జరుగుతున్న ప్రార్థనా మందిరం నిర్మాణాన్ని వెంటనే ఆపేయాలని డిమాండ్ చేస్తూ శంషాబాద్ మున్సిపల్ కార్యాలయాన్ని ఏకే టౌన్ షిప్ కాలనీ వాసులు ముట్టడించారు. ఈ విషయంలో కోర్టుకు మున్సిపల్ కమిషనర్ తప్పుడు నివేదిక అందించారని ఆగ్రహిస్తూ శనివారం కుటుంబ సభ్యులు చిన్నారులతో కలిసి ఏకే టౌన్ షిప్ నుంచి శంషాబాద్ మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీగా తరలివచ్చారు. కమిషనర్ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. ప్రార్థనా మందిరం నిర్మాణాన్ని ఆపేసి ఆ స్థలంలో ప్రహరీ గోడ నిర్మించి భద్రత కల్పించాలని మున్సిపల్ కమిషనర్ సాబేర్ ఆలీకి వినతి పత్రం అందజేశారు. స్థలాన్ని కాపాడేందుకు చర్యలు తీసుకుంటామని హామీ లభించడంతో కాలనీ వాసులు వెనుదిరిగారు.
వెంచర్ నిర్మించిన సమయంలో తమకు సొసైటీ బిల్డింగ్ కోసం 212 గజాల స్థలాన్ని కేటాయించారన్నారు. ఈ స్థలంలో సొసైటీ బిల్డింగ్, పార్కు, సెప్టిక్ ట్యాంక్, నిర్మాణానికి స్థలాన్ని వదిలి ప్లాట్లు విక్రయించారని వెల్లడించారు. కుల మతాలకతీతంగా వెంచర్ నిర్మించాలని సూచించడం జరిగిందన్నారు. దీనిపై ఇప్పుడు ప్రశ్నిస్తే.. తమ ఇష్టం వచ్చినట్టు నిర్మించుకుంటామని చెబుతున్నారని వివరించారు.