కేసీఆర్ ముక్కు నేలకు రాసిన తర్వాతే ఓటు అడగాలి: ఆకునూరి మురళి

కేసీఆర్ ముక్కు నేలకు రాసిన తర్వాతే ఓటు అడగాలి: ఆకునూరి మురళి

సీఎం కేసీఆర్ ముక్కు నేలకు రాసిన తర్వాతే ఓటు అడగడానికి రావాలని జాగో తెలంగాణ సభ్యులు ఆకునూరి మురళి అన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం ఎవరైనా సలహా ఇస్తే.. సీఎం ఎవరి మాట వినడు కాబట్టే ఈరోజు కాళేశ్వరానికి అలాంటి పరిస్థితి వచ్చిందని విమర్శించారు. సొంత నియోజకవర్గాన్ని కూడా సీఎం పట్టించుకోడని తెలిపారు. గజ్వేల్ ప్రజలకు మాత్రమే కాదు.. తెలంగాణ ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలని తెలిపారు.  

తెలంగాణ ప్రభుత్వం అమల్లోకి వస్తే అభివృద్ధి జరుగుతుందని పొరపాటు పడ్డవారిలో తాముకూడా ఉన్నామని ఆకునూరి మురళి అన్నారు. కానీ ఇప్పుడు కేవలం రాష్ట్రంలో  అవినీతి, హింస పాలన మాత్రమే జరుగుతుందని విమర్శించారు. భూమి, ఇసుక, విద్య, వైద్యం, మద్యం. ఇలా అన్ని వాటిల్లో మాఫియా జరుగుతుందని మండిపడ్డారు. 

ఉదయం నుంచి రాత్రి వరకు అబద్ధాలు ఆడే సీఎం మనకు దొరికాడని వ్యాఖ్యానించారు. ఇప్పటివరకు ఇలాంటి ముఖ్యమంత్రిని ఎప్పుడూ చూడలేదన్నారు. రాజకీయ నాయకులు, సినిమా స్టార్స్, వ్యాపార వేత్తలకు కూడా రైతుబంధు రావడం ఆశ్చర్యమన్నారు. 

ఇంకోసారి తెలంగాణ ప్రభుత్వం అమల్లోకి వస్తే 35 లక్షల నిరుద్యోగులకు ఉద్యోగాలు రావు.. 20 లక్షల మందికి సొంత ఇంటి కల దూరమవుతుందన్నారు. అలాగే 25 లక్షల కౌలు రైతులకు నష్టం కలుగుతుంది.. 60 లక్షల మంది మధ్యతరగతి పిల్లల తల్లిదండ్రులకు నష్టం వాటిల్లుతుందని వ్యాఖ్యానించారు. 

తెలంగాణ ఎన్నికలలో ప్రజాస్వామ్యాన్ని గెలిపిద్దామనే నినాదంతో.. పౌరసమాజ వేదిక పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమానికి భారత బచావో, తెలంగాణ సమైక్య, ముస్లిం జేఏసీ, జాగో  తెలంగాణ, టీపీజేఏసీ సభ్యులు హాజరయ్యారు.