రాష్ట్ర బడ్జెట్ నుండి రూ.100 కోట్లు ఇవ్వాలి

రాష్ట్ర బడ్జెట్ నుండి రూ.100  కోట్లు ఇవ్వాలి

సీఎం కేసీఆర్ ప్రభుత్వ విద్యను ద్వంసం చేసున్నారని సోషల్‌ డెమోక్రటిక్‌ ఫోరం కన్వీనర్, రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి ఆకునూరి మురళి విమర్శించారు. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల సమస్యలపై సోషల్‌ డెమోక్రటిక్‌ ఫోరం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న ఆయన పేద పిల్లల విద్య కోసం ప్రభుత్వం బడ్జెట్ నుండి నిధులు ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని  మండిపడ్డారు. విద్యార్థుల కనీస అవసరాలకు డబ్బులు ఇవ్వడం లేదన్నారు.  

ఒక్క రూపాయి కూడా స్టేట్ బడ్జెట్ నుండి ఇవ్వరా అని అకునూరి మురళి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి పేదల సమస్యలు పట్టించుకోవట్లేదన్నారు. . బాసర ట్రిపుల్ ఐటీ లో నెలకొన్న సమస్యలన్నీ పరిష్కరిస్తామని రెండు నెలల క్రితమే ప్రభుత్వం  హామీ ఇచ్చిందన్నారు. కానీ తీరా చూస్తే ఒక్క సంవత్సరానికి వీసీ డిప్యుటేషన్ ఇచ్చారు. వీసీ ఏడాదిలో ఏం చేయగలరని నిలదీశాడు. ప్రభుత్వం నుండి ఎలాంటి సపోర్ట్ చేయకుంటే ఆయన మాత్రం ఏం చేయగలరని అన్నారు.

బాసర ట్రిపుల్ ఐటీకి ఫుల్ టైం వీసీ, డైరెక్టర్, ఫైనాన్సర్ ఇవ్వాలని సోషల్ డెమోక్రటిక్ ఫోరం నుండి డిమాండ్ చేస్తున్నామని అన్నారు. అంతేకాదు రాష్ట్ర బడ్జెట్ నుండి రూ. 100 కోట్లు ఇవ్వాలన్నారు. అయితే ఈ బడ్జెట్ పుస్తకాల్లో రాసుకోవడానికి కాకుండా ఫండ్స్ రిలీజ్ చేయాలని తెలిపారు. అలాగే ప్రతి 30 మంది విద్యార్థులకు ఒక ఫ్యాకల్టీ మెంబర్ ఉండాలని ఆకునూరి మురళి డిమాండ్ చేశారు.