కాళేశ్వరం ఒక చెత్త ప్రాజెక్టు.. ఇలాంటి ప్రాజెక్టు కట్టిన కేసీఆర్​ను జైల్లో పెట్టాలె

కాళేశ్వరం ఒక చెత్త ప్రాజెక్టు.. ఇలాంటి ప్రాజెక్టు కట్టిన కేసీఆర్​ను జైల్లో పెట్టాలె
  • రూ.500 కోట్ల కమీషన్​ల కోసమే చెన్నూరు లిఫ్ట్: ఆకునూరి మురళి  
  • కాళేశ్వరం కమీషన్​లతోనే జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్: కోదండరామ్​
  • చెన్నూరు ఎత్తిపోతలు వద్దని అఖిలపక్ష సమావేశంలో తీర్మానం 

హైదరాబాద్, వెలుగు: సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్​ చెప్తున్నట్టుగా కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్​ప్రాజెక్టు కాదని, అది ఒక చెత్త ప్రాజెక్టు అని రిటైర్డ్​ఐఏఎస్ ఆకునూరి మురళి అన్నారు. ‘గ్రావిటీతో నీళ్లొస్తుంటే చెన్నూరు ఎత్తిపోతలు ఎందుకు’ అనే అంశంపై గురువారం సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో తెలంగాణ జల సాధన సమితి నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. నాలుగేండ్ల క్రితమే ప్రారంభించిన ఈ ప్రాజెక్టు నుంచి 154 టీఎంసీలు మాత్రమే ఎత్తిపోశారని, అందులో 50 టీఎంసీలకు పైగా నీళ్లను మళ్లీ నదిలోకే 
వదిలేశారని ఇరిగేషన్​ డిపార్ట్​మెంట్​ లెక్కలు చెప్తున్నాయన్నారు. ఈ లెక్కన ఈ ప్రాజెక్టు ఎఫిషియెన్సీ18 శాతమేనని, థర్డ్​టీఎంసీ కూడా ప్రారంభిస్తే ఇది ఇంకా తగ్గిపోతుందన్నారు. ‘‘ఒక్క ఎకరానికి నీళ్లు ఇవ్వడానికి ఈ ప్రాజెక్టుతో రూ.లక్ష ఖర్చవుతుంది. ఎత్తిపోతల కోసం ఏటా 5 వేల మెగావాట్ల కరెంట్​అవసరమవుతుంది. బుద్ధి ఉన్నోడెవడూ ఈ ప్రాజెక్టును కొనసాగించడు” అని ఆయన విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు సక్సెస్​అయితే.. అది ఎలాగో సీఎం కేసీఆర్​ప్రెస్​మీట్​పెట్టి వివరించాలని సవాల్​విసిరారు. 

కమీషన్ల కోసమే చెన్నూరు లిఫ్ట్.. 

సీఎం కేసీఆర్ కు చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్​దత్తపుత్రుడని, ఇద్దరూ కమీషన్​లు మింగేందుకే చెన్నూరు లిఫ్ట్ స్కీం చేపట్టారని మురళి ఆరోపించారు. ఈ ప్రాజెక్టుతో రూ.500 కోట్ల కమిషన్​లు పొందాలని టార్గెట్​గా పెట్టుకున్నారని తెలిపారు. నాగార్జునసాగర్, శ్రీశైలం, శ్రీరాంసాగర్​సహా ఏ ప్రాజెక్టు కట్టినపుడు కూడా అప్పటి సీఎంలు జోక్యం చేసుకోలేదని, కేసీఆర్​తానే చీఫ్​ఇంజనీర్​గా మారి ప్రాజెక్టు కట్టారు కాబట్టే కాళేశ్వరం పంపుహౌస్​లు మునిగాయన్నారు. తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ ఎందుకు కట్టడం లేదో ప్రభుత్వం చెప్పాలన్నారు. కాళేశ్వరం, చెన్నూరు లిఫ్ట్ లాంటి ప్రాజెక్టులు చేపట్టిన కేసీఆర్​పై న్యాయపోరాటం చేసి జైలుకు పంపాలన్నారు.

 
గ్రావిటీతో నీళ్లొస్తుంటే.. లిఫ్ట్ ఎందుకు?: కోదండరామ్    

కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి మేఘా కృష్ణారెడ్డి ప్రపంచంలోనే కుబేరుడు అయితే కేసీఆర్ ఈ ప్రాజెక్టు కమీషన్లతోనే జాతీయ రాజకీయాల్లోకి పోతున్నారని టీజేఎస్​అధ్యక్షుడు ప్రొఫెసర్​కోదండరామ్​అన్నారు. ప్రాణహిత – చేవెళ్ల రీ డిజైనింగ్​తో మంచిర్యాల, ఆసిఫాబాద్​జిల్లాలకు తీవ్రనష్టం జరిగిందన్నారు. తాను సీఎం కేసీఆర్​ను చివరిసారి కలిసినప్పుడు ఇదే ఆందోళన వ్యక్తం చేస్తే కాళేశ్వరంతో పాటే తుమ్మిడిహెట్టికి శంకుస్థాపన చేస్తానని హామీ ఇచ్చారన్నారు. అవసరమైతే ముందే తుమ్మిడిహెట్టికి శంకుస్థాపన చేస్తామన్న కేసీఆర్​ఇప్పుడు ఆ ప్రాజెక్టే లేకుండా చేశారన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్​జిల్లా ప్రాజెక్టుల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. గడ్డెన్నవాగు, వట్టివాగు ప్రాజెక్టులకు కాల్వలే లేవన్నారు. ‘‘తుమ్మిడిహెట్టి కట్టండి.. ఆదిలాబాద్​తూర్పు జిల్లాకు నీళ్లివ్వండి” అనే నినాదంతో పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ శుక్రవారమే చెన్నూరు ఎత్తిపోతలకు శంకుస్థాపన చేస్తున్నారని, తుమ్మిడిహెట్టి కట్టాలనే డిమాండ్​తో మంచిర్యాలలో పోస్టర్లు వేద్దామని సూచించారు. తుమ్మిడిహెట్టి నుంచి చెన్నూరుకు గ్రావిటీతోనే నీళ్లు వస్తాయని, అలాంటప్పుడు ఎత్తిపోతలు అవసరమే లేదన్నారు. కాళేశ్వరం పేరుతో రీడిజైనింగ్​చేయకుండా తుమ్మిడిహెట్టి కట్టి ఉంటే తెలంగాణ అప్పుల పాలయ్యేదే కాదన్నారు. ఈ ప్రాజెక్టుకు ఖర్చు చేసిన మొత్తంతో 33 పెండింగ్​ప్రాజెక్టులతో పాటు పాలమూరు– రంగారెడ్డి లిఫ్ట్ స్కీం కూడా పూర్తయ్యేదన్నారు.

కాల్వ తవ్వితే చాలు నీళ్లొస్తయ్: నైనాల గోవర్ధన్ 

చెన్నూరు ఎత్తిపోతల చేపట్టడానికి బదులుగా గ్రావిటీతోనే నీళ్లు తీసుకోవచ్చని టోపోషీట్ల ద్వారా తెలంగాణ జలసాధన సమితి నాయకుడు నైనాల గోవర్ధన్​ వివరించారు. ఎస్సారెస్పీ ఉత్తర కాలువ(మందాకిని)కు ఎన్టీఆర్​సీఎంగా ఉన్నప్పుడే శంకుస్థాపన చేశారని, ఆ కాల్వ తవ్వి ఉంటే చెన్నూరుకు గ్రావిటీతో నీళ్లు వచ్చేవన్నారు. కుప్టి, ఎల్లంపల్లి, తుమ్మిడిహెట్టితో పైసా ఖర్చు లేకుండా గ్రావిటీతో నీళ్లిచ్చే అవకాశమున్నా రూ.2 వేల కోట్ల వరకు ఖర్చు చేసి మూడు లిఫ్టులు ఎవరి కోసం నిర్మిస్తున్నారో చెప్పాలన్నారు. కేసీఆర్​ప్రారంభించిన గూడెం లిఫ్ట్​స్కీం 55 సార్లు ఫెయిల్​అయ్యిందన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్​లో వంద వరకు లిఫ్టులున్నా అవన్నీ ఫెయిల్​అయ్యాయని తెలిపారు. 

కేసీఆర్ దోపిడీని అడ్డుకోవాలె: జస్టిస్ చంద్రకుమార్ 

ప్రాణహిత- చేవెళ్లను రూ.18 వేల కోట్లతో ప్రతిపాదిస్తే కేసీఆర్​ రీడిజైనింగ్​ పేరుతో రూ.1.20 లక్షల కోట్లకు పెంచారని రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్​ చంద్రకుమార్​ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు గ్రీన్​సిగ్నల్​ ఇచ్చిన అప్పటి వ్యాప్కోస్​ ఎండీ ఇంటిపై సీబీఐ దాడి చేస్తే భారీ ఎత్తున నోట్ల కట్టలు దొరికాయని, కేసీఆర్ వ్యవస్థలను ఏ స్థాయిలో దుర్వినియోగం చేస్తారో ఇది రుజువు చేస్తుందన్నారు. కేసీఆర్​ దోపిడీని అడ్డుకోకపోతే తెలంగాణ అస్థిపంజరంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.


లిఫ్ట్ స్కీంలన్నీ ఫెయిలవుతున్నయ్.. 

తుమ్మిడిహెట్టి నుంచి మైలారం వరకు తవ్విన ప్రాణహిత –చేవెళ్ల కాల్వను రిజర్వాయర్​గా మార్చితే 5 టీఎంసీలు నిల్వ చేసుకోవచ్చని, తుమ్మిడిహెట్టి పూర్తి చేస్తే మంచిర్యాల, ఆసిఫాబాద్​జిల్లాలకు నీళ్లు వస్తాయని రిటైర్డ్​ ఇంజనీర్​విఠల్​రావు తెలిపారు. కాళేశ్వరం రీడిజైనింగ్​తో ఉమ్మడి ఆదిలాబాద్​జిల్లాలో 2 లక్షల ఎకరాలు, రంగారెడ్డి జిల్లాలో 2.40 లక్షల ఎకరాలకు నీళ్లు అందకుండా పోయిందన్నారు. చెన్నూరుకు గ్రావిటీతోనే నీళ్లు ఇవ్వాలని కోరుతూ సీఎం కేసీఆర్​కు లేఖ రాస్తామని కాంగ్రెస్ ​సీనియర్​ నేత కోదండరెడ్డి తెలిపారు. లిఫ్ట్ స్కీంలన్నీ ఎలక్ట్రో మెకానికల్​యంత్రాల సమస్యలు, పైపులతో విఫలమవుతున్నాయని, ఇకనైనా వాటికి స్వస్తి పలికి గ్రావిటీ ప్రాజెక్టులే చేపట్టాలని రిటైర్డ్​ ఇంజనీర్ లక్ష్మీనారాయణ తెలిపారు. ప్రొఫెసర్​ వినాయక రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో రిటైర్డ్ ఇంజనీర్ ​వెంకట రమణ, రిటైర్డ్ ప్రొఫెసర్ వెంకట నారాయణ, వివిధ పార్టీలు, సంఘాల నాయకులు పశ్య పద్మ, వేములపల్లి వెంకట్రామయ్య, కొండేటి సత్యనారాయణ, మన్నారం నాగరాజు, శ్రీనివాస్ యాదవ్, సారయ్య తదితరులు పాల్గొన్నారు.