స్కూళ్ల సమగ్ర అభివృద్ధికి చర్యలు : ఆకునూరి మురళీ

స్కూళ్ల సమగ్ర అభివృద్ధికి చర్యలు : ఆకునూరి మురళీ
  • తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళీ

ఖమ్మం టౌన్, వెలుగు : విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా అధికారులు పని చేయాలని తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళీ సూచించారు. బుధవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్​లో కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, అడిషనల్​ కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజతో కలిసి అధికారులతో ఆయన సమావేశమయ్యారు. మధిర నియోజకవర్గంలో పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపికైన 11 ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు.  

అంతర్జాతీయ స్థాయిలో ప్రతీ మండలంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్  ప్రవేశ పెట్టాలని విద్యా కమిషన్​ ప్రభుత్వానికి సిఫార్సు​ చేసిందన్నారు.  ప్రతీ పాఠశాలలో టీచింగ్ సరిగ్గా జరిగేలా చూడాలన్నారు. నియోజకవర్గంలో ఎంపిక చేసిన 11 ప్రభుత్వ పాఠశాలల్లో 2 స్కూళ్లను కేటగిరీ 1 కింద,  మిగతా వాటిని కేటగిరీ 2గా విభజించాలన్నారు.  కేటగిరీ 1 లోని స్కూళ్లలో 1,000 నుంచి 1,200 మంది విద్యార్థులకు సరిపడా తరగతి గదులు, లైబ్రరీ, ల్యాబ్స్, స్పోర్ట్స్, కిచెన్, డైనింగ్ హాల్, కాంపౌండ్ వాల్ లాంటి సౌకర్యాలు పూర్తి స్థాయిలో కల్పించాలన్నారు. 

క్యాటగిరి 2 లోని 9 స్కూళ్లలో  రూ.కోటి నుంచి రూ.2 కోట్లు ఖర్చు చేసి అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు తయారు చేయాలని చెప్పారు. కేటగిరీ 1 లో సిరిపురం, జమలాపురం పాఠశాలలను ఎంపిక చేస్తున్నట్లు తెలిపారు. అడిషనల్​ కలెక్టర్​ శ్రీజ మాట్లాడుతూ, 11 పాఠశాలల్లో స్కూల్ మేనేజ్​మెంట్ కమిటీ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు.  క్యాటగిరి 1 లో అభివృద్ధి పనులు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని చెప్పారు.

 కేటగిరీ 2 లో ఉన్న 9 పాఠశాలల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను పరిశీలించి నివేదిక తయారు చేయాలన్నారు.  ఈ సమావేశంలో డీఈవో ఎస్. సత్యనారాయణ, విద్యాశాఖ ప్లానింగ్ కో ఆర్డినేటర్ రామకృష్ణ, విద్యా శాఖ ఈఈ విన్సెంట్ రావు, మండల విద్యా శాఖ అధికారులు, విద్యా శాఖ డీఈలు, ఏఈ లు తదితరులు పాల్గొన్నారు.