
- ఆలంపూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే అబ్రహం
- ఇప్పటి నుంచే టీఆర్ఎస్ అన్ని ఏర్పాట్లు చేస్తున్నది
- ‘ముందస్తు’ ప్రకటనకు 8న వనపర్తి మీటింగ్ వేదిక కావొచ్చని కామెంట్
- టీఆర్ఎస్ ఎమ్మెల్యే అబ్రహం
గద్వాల, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర సర్కారు ఏవిధమైన సహకారం అందించడం లేదని, దీంతో కేంద్రాన్ని ఢీకొనేందుకు రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు రావచ్చని, ఆ ప్రకటనకు ఈ నెల 8న వనపర్తి లో జరిగే మీటింగ్ వేదిక కావచ్చని ఆలంపూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ అబ్రహం కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన ఐజ టౌన్ లో ఓ బీటీ రోడ్డు పనులను ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని, అందుకోసం టీఆర్ఎస్ ఇప్పటి నుంచే అన్ని ఏర్పాట్లు చేస్తున్నదని చెప్పారు. వనపర్తి మీటింగ్ కు ఆలంపూర్ నియోజకవర్గం నుంచి పది వేలమందిని తరలించేందుకు బస్సులు ఏర్పాటుచేశామని, రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, ఆసరా పెన్షన్లు తీసుకుంటున్న వాళ్లంతా తప్పనిసరిగా మీటింగ్కు రావాలన్నారు. భోజన వసతి కూడా ఏర్పాటుచేశామని ఎమ్మెల్యే చెప్పారు. ఈ మధ్య ప్రతిపక్షనేతలు దళిత బంధు అందరికీ రాదనే ప్రచారం చేస్తున్నారని, గతంలోనూ దళితబంధు గురించి ఇలాంటి మాటలే మాట్లాడారని, ఇప్పుడు అందరికీ వస్తున్నదని ఆయన అన్నారు.