కంప్లైంట్ చేసిందని కొలువు నుంచి తీసేశారు

కంప్లైంట్ చేసిందని కొలువు నుంచి తీసేశారు

చైనా ఈ కామర్స్ దిగ్గజం అలీబాబాను లైంగిక ఆరోపణలు కుదిపేస్తున్నాయి. గత ఆగస్టులో ఓ యువతి తనపై అత్యాచారం జరిగిందంటూ ఫిర్యాదు చేయగా.. తాజాగా ఆ యువతికి కంపెనీ షాకిచ్చింది. తప్పుడు ఆరోపణలతో అలీబాబా ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తోందంటూ సదరు యువతిని ఉద్యోగం నుంచి తొలగించింది. 

అలీబాబాకు చెందిన ఓ ఫిమేల్ ఎంప్లాయి ఆగస్టులో బిజినెస్ ట్రిప్ సందర్భంగా మేనేజర్, క్లయింట్ తనకు బలవంతంగా మద్యం తాగించి అత్యాచారానికి పాల్పడ్డారంటూ మేనేజ్ మెంట్ కు ఫిర్యాదు చేసింది. యాజమాన్యం పట్టించుకోకపోవడంతో కొందరు ఉద్యోగులు ఆమెకు మద్దతుగా నిలిచారు. దీంతో కంపెనీ బాధితురాలికి అండగా నిలిచిన 10 మంది ఉద్యోగుల్ని విధుల నుంచి తొలగించింది. విషయం కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడం, విమర్శలు వెల్లువెత్తడంతో వారిని తిరిగి విధుల్లో చేర్చుకుంది. దిద్దుబాటు చర్యల్లో భాగంగా నిందితుడిపై వేటు వేయడంతో పాటు యువతి ఫిర్యాదుపై సకాలంలో స్పందించని ఇద్దరు ఎగ్జిక్యూటివ్స్ ను సస్పెండ్ చేసింది. 
లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు కొనసాగుతుండగానే తాజాగా బాధితురాలికి అలీబాబా యాజమాన్యం షాకిచ్చింది. అసత్య ఆరోపణలు చేసి కంపెనీ పరువు ప్రతిష్టల్ని దెబ్బతీస్తోందంటూ ఆమెపై వేటు వేసింది. నవంబర్ 25న ఆమెను ఉద్యోగం నుంచి తొలగించింది. అంతేకాదు.. గతంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని తిరిగి విధుల్లో చేర్చుకుంది. అలీబాబా నిర్ణయంపై ఇప్పుడు తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మేనేజ్ మెంట్ మాత్రం ఈ అంశంపై ఇంకా స్పందించలేదు.