
టూర్ అంటే వారం లేదా పదిరోజులు.. కనీసం నాలుగు రోజులైనా ప్లాన్ చేస్తారు. కానీ, కొన్ని ప్లేస్‌లు ఒకటి లేదా రెండు రోజుల్లో చూసేయొచ్చు. అలాంటి వాటిల్లో పాపులర్ ప్లేస్ ఇది. పేరు అలీబాగ్. ఇక్కడ అందమైన బీచ్‌లు అడుగుకొకటి ఉంటే, వాటి ఒడ్డునే అద్భుతమైన కోటలు ఉన్నాయి. ఇక్కడికి వెళ్తే ఒక రోజంతా ఫుల్ ఎంజాయ్మెంట్ పక్కా.
అలీబాగ్... మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లాలో ఉంది. అక్కడి అందమైన బీచ్‌లు, పురాతన కోటలు, థ్రిల్లింగ్ వాటర్ స్పోర్ట్స్ చాలా పాపులర్. దీన్ని మహారాష్ట్రలోని ‘మినీ గోవా’ అని పిలుస్తారు. రోడ్డు, రైలు, ఫెర్రీల ద్వారా జర్నీ చేయొచ్చు. అక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకు బెస్ట్ టైం. అలీబాగ్‌లో ఎంజాయ్ చేయడానికి బెస్ట్ ప్లేస్‌లు ఇవి.
అద్భుతమైన పురాతన కోటలు
కొలాబా
ఇది అలీబాగ్‌కి దాదాపు రెండు కిలో మీటర్ల దూరంలో ఉంది. అలీబాగ్ బీచ్‌కి దగ్గరగా ఉంటుంది. దీనికి 300 ఏండ్ల నాటి చరిత్ర ఉంది. ఈ కోట అన్ని వైపులా అరేబియా సముద్రం ఉంటుంది. ప్రస్తుతం ఈ కోట అలీబాగ్‌లోని పాపులర్ టూరిస్ట్ ప్లేస్ల్లో ఒకటి. ఒకప్పుడు శివాజీ మహారాజ్ హయాంలో మహరాష్ట్రలోని ప్రధాన నౌకాదళ స్థావరం ఇది. ఈ కోటకు ప్రధాన ద్వారాలు రెండు ఉన్నాయి. ఒకటి సముద్ర తీరంలో, మరొకటి అలీబాగ్ దగ్గర్లో. ఇక్కడ అలల్ని చూసి అబ్బురపడుతూ, కోట చరిత్రను తెలుసుకోవచ్చు. కోట గోడలపై ఉన్న ఏనుగులు, నెమళ్లు, పులుల శిల్పాలు శతాబ్దాల చరిత్రను గుర్తు చేస్తాయి.
మురుద్ జంజీరా కోట
మురుద్ జంజీరా కోట 17వ శతాబ్దం నాటిది. దీన్ని మొదట చెక్కతో కట్టారు. తర్వాత సిడి సిరుల్ ఖాన్ దీన్ని మళ్లీ కట్టించాడు. ఈ కోటలో సెంట్రల్ కారిడార్‌లో ఒక రాతి శిల్పం ఉంది. అందులో ఆరు ఏనుగులు ఒక అడవి పులిని పట్టుకున్నట్లు ఉంటుంది. అది సిద్దీల ధైర్యానికి చిహ్నంగా భావిస్తారు. ఈ కట్టడంలో దాదాపు 40 అడుగుల పొడవున్న 23 భారీ మూలస్తంభాలు ఉన్నాయి. ఈ కోట మురుద్ బీచ్ ఒడ్డున ఉంటుంది. ఆ బీచ్ ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. అక్కడ కెఫెల్లో సీఫుడ్ వెరైటీలు, కొబ్బరి, స్వీట్ కార్న్ వంటి కొన్ని లోకల్ వంటకాలు దొరుకుతాయి.
అందమైన బీచ్‌లు
వర్సోలీ
ఇది కూడా టూరిస్ట్‌లకు చాలా బాగా నచ్చే ప్రదేశం. చెప్పాలంటే అలీబాగ్ టూర్ ప్లాన్ చేసేవాళ్లంతా తప్పకుండా ఈ ప్లేస్ చూడకుండా వెళ్లరు. ఎందుకంటే ఇక్కడ రద్దీ తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఈ ప్లేస్ రిసార్ట్లు, లగ్జరీ హోటల్స్‌కు ఫేమస్. ఇక్కడ రకరకాల నీటిలో ఆడే ఆటలు (వాటర్ స్పోర్ట్స్) కూడా ఉంటాయి. ఈ బీచ్‌లో బనానా బోట్ రైడ్, పారాసెయిలింగ్, జెట్ స్కీయింగ్ వంటి అడ్వెంచర్స్ చేయొచ్చు. ఇది అలీబాగ్ మెయిన్ బస్ స్టాండ్ నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
కిహిమ్
ఇది కూడా చాలా ఫేమస్. అక్కడ చెట్లు, అడవి పూలు, వలస పక్షులు కనువిందు చేస్తాయి. ఇక్కడ కూడా వాటర్ స్పోర్ట్స్, గుర్రపు స్వారీ, బీచ్ బైకింగ్ చేయొచ్చు.
మాండ్వా
ఇక్కడకు ఫ్యామిలీతో వచ్చేవాళ్లు ఎక్కువ. తక్కువ ఖర్చుతో ఫెర్రీ లేదా పడవలో వెళ్లిరావొచ్చు. దీన్ని సీజన్లో మాత్రమే అనుమతిస్తారు. అది కూడా డే టైంలోనే. ఎంట్రీ ఫీజు ఏం ఉండదు.
కాషిద్
ఈ బీచ్ మూడు కిలో మీటర్ల పొడవు ఉంటుంది. బార్డర్లో అందమైన చెట్లు, మొక్కలు ఉంటాయి. ఇది మాండ్వాకు దగ్గరలోనే ఉంది. ఇక్కడికి ఏడాది పొడవునా వెళ్లొచ్చు.
బ్రహ్మ కుండ్
ఇది అలీబాగ్‌లో చూడదగ్గ ప్లేస్ల్లో ముఖ్యమైనది. 1612లో కట్టిన దీన్ని పవిత్రమైన ప్రదేశంగా చూస్తారు. ఇక్కడ శివ కుండ్, బ్రహ్మాస్ కుండ్ అనే రెండు కుండ్లు అన్ని వైపులా మెట్ల దగ్గర కనిపిస్తాయి. కుండ్ అంటే కొలను. పురాణాల ప్రకారం, ఈ కుండ్‌ను శ్రీకృష్ణుడి పాలనలో భూమిపైకి వచ్చిన బ్రహ్మ స్వయంగా దీన్ని కట్టడం వల్లే దీనికి ‘బ్రహ్మ కుండ్’ అనే పేరు వచ్చింది అంటారు. ఈ కుండ్‌ని సృష్టించడానికి బ్రహ్మదేవుడు కృష్ణుడికి స్నానం చేయించి, మిగిలిన నీటిని తీసుకువెళ్లి ఈ దివ్య కొలనుని నింపాడని చెప్తుంటారు. ఈ ట్యాంక్ పక్కన, శివ కొలను పేరుతో మరొక చిన్న ట్యాంక్ కూడా ఉంది. బ్రహ్మ కుండ్‌ను మనదేశంలోని అన్ని ప్రాంతాల నుండి ప్రతి ఏటా టూరిస్ట్‌లు, భక్తులు సందర్శిస్తారు. ఈ దివ్య ట్యాంక్ నీటిలో స్నానం చేస్తారు. ఈ ట్యాంక్ పక్కనే ‘మారుతీ మందిర్’ పేరుతో ఒక చిన్న దేవాలయం ఉంది. ఆలయ గోడలపై పురాతన కాలం నాటి శిల్పాలతో పాటు బ్రహ్మ దేవుడు, కుండ్‌ను సృష్టించిన కథ శాసనాలుగా రాసి ఉంది.
కనకేశ్వర్ గార్డెన్
వన్యప్రాణులను చూడాలనుకునేవాళ్లు ఈ గార్డెన్‌కి వెళ్లాలి. అక్కడ క్యాంప్ చేయొచ్చు లేదా వాకింగ్ చేయొచ్చు.
బృందావన్ ఫామ్
ఈ ప్రదేశం చెట్లు, మొక్కలు, పూలు, పండ్లతో పాటు మూలికలు పెరగడానికి అనువైనది. అక్కడ క్రాఫ్ట్ మ్యూజియం కూడా ఉంది. అక్కడ తేనె, సుగంధ ద్రవ్యాలు, మైనపు కొవ్వొత్తులు వంటి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కొనొచ్చు. ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలనుకునేవాళ్లకు ఇక్కడ టిప్స్ కూడా చెప్తారు.
రాయ్‌గఢ్ బజార్
ఒక్క రోజు ట్రిప్ కోసం వెళ్లినా ఈ బజార్ చూడటం అస్సలు మిస్ కాకూడదు. ఎందుకంటే ఇక్కడ తక్కువ ధరలో కావాల్సిన వస్తువులు దొరుకుతాయి. రకరకాల ఫ్యాషన్ బట్టలు, గిఫ్ట్స్, ఇంటీరియర్ డిజైనింగ్‌కి కావాల్సిన ఐటమ్స్ ఉంటాయి. షాపింగ్ తర్వాత శ్నాక్స్ కూడా రుచి చూడొచ్చు.
విక్రమ్ వినాయక్ మందిర్
దీన్ని ‘బిర్లా టెంపుల్’ అని కూడా పిలుస్తారు. ఇది కొండపైన ఉంది. తెల్లరాతితో కట్టిన టెంపుల్ ప్రత్యేకత. ఈ దేవాలయం మనదేశంలో గొప్ప కళ, వాస్తు శిల్పానికి గుర్తు.
కర్మాకర్ మ్యూజియం
శిల్పాలు, చారిత్రక కళలను ఇష్టపడే వాళ్లకు ఈ మ్యూజియం బాగా నచ్చుతుంది. ఇక్కడ దాదాపు రెండు వందల శిల్పాలు ఉన్నాయి.
ఎలా వెళ్లాలి?
అలీబాగ్ ముంబై నుండి వంద కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. విమాన, రైలు, రోడ్డు జర్నీ చేయొచ్చు. ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి చాలా దగ్గర. ముంబై నుండి అలీబాగ్‌కు పడవ ప్రయాణం కూడా చేయొచ్చు. పెన్, కాసు, హమరాపుర్ వంటి రైల్వే స్టేషన్స్ ఉన్నాయి. మెయిన్ సిటీల నుంచి ప్రభుత్వ, ప్రైవేట్ బస్సులు అందుబాటులో ఉంటాయి.
అలిచి బాగ్
అలీబాగ్ని మొదట ‘అలిచి బాగ్’ అని పిలిచేవాళ్లు. ఎందుకంటే అలీగా ప్రసిద్ధి చెందిన ‘బెనే ఇజ్రాయెల్’ అనే ధనవంతుడికి ఇక్కడ మామిడి, కొబ్బరి తోటలు చాలా ఉన్నాయి. అందువల్ల స్థానికులు ఈ స్థలాన్ని ‘అలిచి బాగ్’గా గుర్తించేవారు. వాడుకలో అది ‘అలీబాగ్’గా మారింది.