V6 News

డీఈవో ఆఫీసుల్లో ఫైళ్లన్నీ ఆన్‌‌లైన్‌‌

డీఈవో ఆఫీసుల్లో ఫైళ్లన్నీ ఆన్‌‌లైన్‌‌
  • జనవరి 1 ఈ -ఆఫీసు పద్ధతిని అమలు చేయాలి 
  • కలెక్టర్లు, ఆర్జేడీలకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఆదేశాలు
  • ఫైళ్లలో పారదర్శకత, వేగం కోసమేనని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: డిస్ట్రిక్ట్‌‌ ఎడ్యుకేషన్‌‌ ఆఫీస్‌‌ (డీఈవో)ల్లో పారదర్శకత, జవాబుదారితనం, పనుల్లో వేగం పెంచేందుకు ఈ – ఆఫీసు పద్ధతిని తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో జనవరి ఫస్ట్‌‌ నుంచి ఆయా ఆఫీసుల్లో ఫైల్స్‌‌ను ఆన్‌‌లైన్‌‌ చేయనున్నారు. ఈ మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ-ఆఫీస్ విధానం అమలు కోసం అన్ని జిల్లాల కలెక్టర్లకు, ఆర్జేడీలకు ఆయన లేఖ రాశారు.

 ప్రస్తుతం హైదరాబాద్‌‌లోని డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీసులో ఈ--ఆఫీస్ విధానం అమలు చేస్తున్నారు. ఇదే తరహాలో జిల్లాల్లోనూ అమలు చేస్తే.. హెడ్డాఫీసు నుంచి వచ్చే ఆదేశాలు, ఉత్తర్వులు సులువుగా, వేగంగా డీఈవోలకు చేరుతాయని అధికారులు భావిస్తున్నారు. 

ఫైళ్ల కదలికలో జాప్యం లేకుండా, ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు ఇది దోహదపడుతుందని చెప్తున్నారు. జిల్లా కలెక్టర్లు తమ పరిధిలోని ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్ల సాయంతో డీఈవో ఆఫీసుల్లో ఈ–-ఆఫీస్ సెటప్ త్వరగా పూర్తయ్యేలా చూడాలని ఆయన సూచించారు. ఇకపై మ్యాన్యువల్ ఫైళ్లకు చెక్ పెట్టి, డిజిటల్ విధానంలోకి మారాల్సిందేనని స్పష్టం చేశారు. డీఈవో ఆఫీసులన్నీ వచ్చే జనవరి 1 నాటికి కచ్చితంగా ‘ఈ- -ఆఫీస్’విధానంలోకి మారిపోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఐటీ టీమ్‌‌తో సమన్వయం చేసుకొని ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు.