యాత్రికుల బస్సుపై ఉగ్రవాదుల దాడి.. ఖండించిన విదేశీ క్రికెటర్లు

యాత్రికుల బస్సుపై ఉగ్రవాదుల దాడి.. ఖండించిన విదేశీ క్రికెటర్లు

జ‌మ్ము క‌శ్మీర్‌లోని ప్రఖ్యాత వైష్ణో దేవి ఆల‌యానికి వెళ్తున్న యాత్రికుల బస్సుపై ఉగ్రవాదులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. దీంతో బస్సు అదుపు తప్పి లోయలో పడి తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా, మరో 33 మంది గాయపడ్డారు. బస్సులోని పది మంది యాత్రికులకు బుల్లెట్ గాయాలయ్యాయి. ఈ ఘటనను యావత్ భారత దేశం ముక్తకంఠంతో ఖండించింది. తాజాగా, ఈ దాడిని విదేశీ క్రికెటర్లు ఖండించారు. రియాసి ఉగ్రవాద దాడి బాధితులకు తమ సంఘీభావాన్ని తెలియజేశారు. 

భారత యువతిని పెళ్లాడిన పాకిస్థాన్ పేసర్ హసన్ అలీ "All Eyes On Vaishno Devi(వైష్ణో దేవి దాడిపై అందరి దృష్టి) అని తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేశాడు. 

తీవ్రవాదం/హింస అనేది ఏదేని జాతి లేదా మతానికి వ్యతిరేకమైన సమస్య కాబట్టి నేను దీన్ని పంచుకున్నాను. నేను శాంతికి మద్దతు ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. గాజాలో జరుగుతున్న దాడులను నేను ఎల్లప్పుడూ ఖండిస్తూనే ఉన్నాను. అలాగే, ఎక్కడైతే అమాయకుల ప్రాణాలు కోల్పోతుంటారో అక్కడా నా గళాన్ని కొనసాగిస్తాను. ప్రతి మనిషి జీవితం ముఖ్యం.." అని హసన్ అలీ తన సంఘీభావాన్ని తెలియజేశారు. 

ట్రావిస్ హెడ్ 

పాకిస్థాన్ పేసర్ అనంతరం ఆసీస్ క్రికెటర్ ట్రావిస్ హెడ్ సైతం రియాసి ఉగ్రవాద దాడి బాధితులకు తమ సంఘీభావాన్ని తెలియజేశారు.  
 "ఆల్ ఐస్ వైష్ణో దేవి అటాక్" తన X హ్యాండిల్ (ట్విట్టర్) రాశారు. కాగా, గతంలో పాలస్తీనియన్లకు ఆశ్రయం కల్పించిన గాజాలోని రఫా నగరంపై ఇజ్రాయెల్ దాడులను కూడా హెడ్ ఇలానే ఖండించారు.

నోరు మెదపని భారత క్రికెటర్లు 

యాత్రికులపై ఉగ్రవాద దాడిని విదేశీ క్రికెటర్లు సైతం ఖండిస్తున్న సమయాన భారత క్రికెటర్లు నోరు మెదపక పోవడం విమర్శలకు దారితీస్తోంది. కొందరు నెటిజన్లు భారత క్రికెటర్లు, వారి సతీమణులను ఉద్దేశిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు.