
హైదరాబాద్, వెలుగు: పట్టణ ప్రాంతాల్లో గ్రీనరీ అవసరమని, మొక్కలు పెంచి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు తన వంతు కృషి చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. సోమవారం (సెప్టెంబర్ 15) మినిస్టర్ క్వార్టర్స్‌లో 18వ గ్రాండ్ నర్సరీ మేళా పేరుతో నిర్వహిస్తున్న ఆలిండియా హార్టీకల్చర్, అగ్రికల్చర్ షో బ్రోచర్‌ను మంత్రి ఆవిష్కరించి, మాట్లాడారు.
హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజాలో ఈ నెల 18 నుంచి 22 వరకు 5 రోజుల పాటు నర్సరీ మేళా ప్రదర్శన ఉంటుందని చెప్పారు. ఈ సందర్భంగా నర్సరీ మేళా ఇన్‌చార్జి ఖలీద్ అహ్మద్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి అగ్రికల్చర్, హార్టీకల్చర్ ఉత్పత్తులతో ఆలిండియా హార్టీకల్చర్ మేళాను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
టెర్రస్ గార్డెనింగ్, వర్టికల్ గార్డెనింగ్, హైడ్రోఫోనిక్ సిస్టమ్ వంటి కొత్త పద్ధతులను ఈ షోలో ప్రదర్శిస్తామన్నారు. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మేళా అందుబాటులో ఉంటుందని తెలిపారు.