
హైదరాబాద్, వెలుగు: మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తో జమిలీ ఎన్నికల అధ్యయన కమిటీ వేయడం ఆశ్చర్యంగా ఉందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ వినోద్ కుమార్ అన్నారు. జమిలీ ఎన్నికల అంశం, తాజా పరిణామాల పై బీఆర్ఎస్లో చర్చిస్తామని తెలిపారు. కమిటీలో అంతా ఉత్తర భారతదేశ సభ్యులు మాత్రమే ఉన్నారని, దక్షిణ భారత దేశం నుంచి ఒక్కరు కూడా లేకపోవడం శోచనీయమని ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
5 రోజుల పాటు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల పేరిట ప్రధాని మోదీ దేశాన్ని గందరగోళ పరిస్థితుల్లోకి నెట్టారన్నారు. 2018లోనే జమిలీ ఎన్నికలపై బీఆర్ఎస్ అభిప్రాయం చెప్పామని గుర్తు చేశారు. జమిలీ ఎన్నికలు మంచిదే కానీ చర్చ జరగాలని లా కమిషన్ కు స్పష్టం చేశామన్నారు. జమిలీ ఎన్నికలపై ఇప్పటికే రిపోర్ట్ రెడీ గా ఉందా ? ఇప్పుడు వేసిన కమిటీ నామ్ కే వాస్తే కమిటీనా అన్న అనుమానం ఉందన్నారు. ఏపీ విభజన చట్టంలో రెండు రాష్ట్రాల అసెంబ్లీలలో శాసన సభ్యుల సంఖ్య పెంచాలని ఉన్నా మోదీ సర్కార్ పట్టించుకోలేదన్నారు. మహిళా రిజర్వేషన్ల బిల్లు విషయంలో పదేండ్లు మోదీ సర్కార్ చేసిందేమిటని ప్రశ్నించారు.