బీసీ సబ్ ప్లాన్ చట్టం చేయాలి : బీసీ సంఘాల నేతలు

బీసీ సబ్ ప్లాన్ చట్టం చేయాలి  : బీసీ సంఘాల నేతలు
  • అఖిలపక్ష, బీసీ సంఘాల నేతలు, మేధావుల డిమాండ్​ 

హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో బీసీ సబ్ ప్లాన్ చట్టం చేయాలని అఖిలపక్ష, బీసీ సంఘాల నేతలు, మేధావులు డిమాండ్ చేశారు. ఇటీవల ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో బీసీలకు అన్యాయం చేశారని, నిధుల కేటాయింపులో తీవ్ర వివక్ష చూపారని మండిపడ్డారు. ఆదివారం హైదరాబాద్​లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర బడ్జెట్-– బీసీల వాటా అనే అంశంపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ​కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో బీసీలను నమ్మించి గద్దెనెక్కిందని, అధికారంలోకి వచ్చాక పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. 

మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్.రమణ మాట్లాడుతూ.. రూ.3.24 లక్షల కోట్ల బడ్జెట్​లో ప్రభుత్వం బీసీల సంక్షేమానికి కేవలం రూ.12,500 కోట్లు కేటాయించి అన్యాయం చేసిందన్నారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. బీసీల సంక్షేమానికి  రూ.20 వేల  కోట్లు కేటాయించాలని, బీసీ సబ్ ప్లాన్​తీసుకురావాలని డిమాండ్ చేసినా సర్కారు పట్టించుకోలేదని ఆరోపించారు. సమావేశంలో మాజీ ఎంపీ వీహెచ్​, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.