బూటకపు ఎన్కౌంటర్లను ఆపాలి : అఖిలపక్ష నేతలు

బూటకపు ఎన్కౌంటర్లను ఆపాలి : అఖిలపక్ష నేతలు
  • పట్టుకొని కాల్చి చంపడం రాజ్యాంగ విరుద్ధం: అఖిలపక్ష నేతలు
  • లొంగిపోయేవారిని ఎన్​కౌంటర్​చేయడం కరెక్ట్​కాదు: జస్టిస్ చంద్రకుమార్
  • ఉద్యమాన్ని అంతం చేయడం అసాధ్యం: ప్రొఫెసర్ హరగోపాల్
  • మావోయిస్టుల పట్ల కేంద్రం దుర్మార్గంగా వ్యవహరిస్తోంది: కూనంనేని
  • ఉద్యమాలను హింసతో ఆపలేరు: కోదండరాం  
  • కేంద్రం విధానాలను అందరూ వ్యతిరేకించాలి: పీసీసీ చీఫ్ ​మహేశ్​గౌడ్

హైదరాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం తక్షణమే బూటకపు ఎన్​కౌంటర్లను ఆపాలని అఖిలపక్ష నేతలు డిమాండ్ చేశారు. మావోయిస్టులను పట్టుకొని కాల్చి చంపడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. గురువారం హైదరాబాద్​లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో ‘ఎన్​కౌంటర్లు –- ప్రజాస్వామ్యం’ అనే అంశంపై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు నేతలు పాల్గొని.. కేంద్ర ప్రభుత్వం మావోయిస్టుల మీద అనుసరిస్తున్న  తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ.. లొంగిపోతున్నవారిని ఎన్​కౌంటర్ల  పేరుతో చంపడం సరికాదని హితవు పలికారు. మావోయిస్టులు కూడా ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలోకి రావాలని కోరారు. విరసం నేత, ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ.. మావోయిస్టులను పట్టుకొని కాల్చి చంపుతున్నారని, ఇది రాజ్యాంగ విలువలను గౌరవించడం కాదని ఆరోపించారు. 

‘నాడు శాంతి చర్చలకు మావోయిస్టులు సిద్ధపడ్డారని.. మోదీ సర్కార్ చర్చలు జరపకుండా ఉద్యమాన్ని అంతం చేస్తామంటోందని, అది సాధ్యంకాదన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. మావోయిస్టుల పట్ల కేంద్రం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని.. వారిని పట్టుకుని ఎన్​కౌంటర్ చేసి చంపుతున్నారన్నారు. ప్రతి ఒక్కరూ దీనిపై స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. టీజేఎఫ్ చీఫ్ కోదండరాం మాట్లాడుతూ.. రాజకీయ ఉద్యమాలను హింసతో ఆపలేరని.. వ్యక్తులను చంపి అణచివేయొచ్చు కానీ.. వ్యవస్థను మార్చలేరన్నారు. మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ.. ప్రశ్నించే ప్రతి ఒక్కరిపై కేంద్రం దాడి చేస్తోందన్నారు. కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాడితే.. జైళ్లకు పంపుతున్నారని మండిపడ్డారు. అరుణోదయ నాయకురాలు విమలక్క మాట్లాడుతూ.. కేంద్రం మానవ హక్కుల హననం చేస్తోందన్నారు. తుపాకీకి తుపాకీ పరిష్కారం కాదని పేర్కొన్నారు. 

హింసకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం: పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

ఇటీవల జరిగిన ఎన్​కౌంటర్లు అన్నీ బూటకమే అనిపిస్తోందని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ హింసను వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు. ఎవరూ ఎవరినీ చంపే హక్కు లేదన్నారు. తాను కూడా మావోయిస్టుల బాధితుడినేనని.. కానీ, మారిన పరిస్థితుల్లో ఎలిమినేషన్ సరికాదన్నారు. ప్రజాస్వా మ్యంలో చంపడమే మార్గం కాదని పేర్కొన్నారు. కేంద్రం ప్రభుత్వ విధానాలను, బూటకపు ఎన్​కౌంటర్లను అందరూ వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. కాగా,  మావోయిస్టుల ఏరివేత పేరుతో కేంద్రం పాల్పడుతున్న బూటకపు ఎన్​కౌంటర్లకు నిరసనగా శుక్రవారం ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద మహాధర్నా నిర్వహించాలని, దేశవ్యాప్తంగా సంతకాల సేకరణ చేపట్టాలని అఖిలపక్ష పార్టీలు నిర్ణయించాయి.