
ముషీరాబాద్, వెలుగు: దేశంలో సామాజిక రిజర్వేషన్లపై ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టమైన విధాన ప్రకటన చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. బీసీల రిజర్వేషన్లపై ఇటీవల బిహార్హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. మంగళవారం దోమలగూడలోని బీసీ భవన్ లో మాజీ ప్రధాని విశ్వనాథ ప్రతాప్ సింగ్ జయంతిని నిర్వహించారు. జాజుల శ్రీనివాస్ గౌడ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. పదేండ్ల బీజేపీ పాలన దేశంలోని బీసీలకు చీకటి పాలన అని విమర్శించారు. ఏ ప్రభుత్వం వచ్చినా ఓబీసీలకు ఒరగబెట్టింది ఏమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగ రంగంలో ఓబీసీలకు మొదటిసారిగా 27% రిజర్వేషన్లు కల్పించిన ఘనత విశ్వనాథ ప్రతాప్సింగ్కే దక్కుతుందన్నారు. అగ్రవర్ణ ప్రధానమంత్రిగా ఉన్న విపి సింగ్ ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తే, ఓబీసీగా చెప్పుకుంటున్న నరేంద్ర మోదీ మాత్రం రాజ్యాంగానికి వ్యతిరేకంగా అగ్రవర్ణాలకు 10 శాతం రిజర్వేషన్లు పెట్టి బీసీల నోట్లో మట్టి కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.
సమావేశంలో బీసీ పెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ విజయ భాస్కర్, బీసీ నేతలు బూడిద మల్లికార్జున్ యాదవ్, పానుగంటి విజయ్, మాదేశి రాజేందర్, వీరమల్ల కార్తీక్, ప్రవీణ్ యాదవ్ జాజుల భాస్కర్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.