రెండు రోజుల్లోనే ప్రాజెక్టులన్నీ ఫుల్

రెండు రోజుల్లోనే ప్రాజెక్టులన్నీ ఫుల్
  • పోటెత్తిన గోదావరి.. తొలిసారి ఇంత త్వరగా నిండిన ఎస్సారెస్పీ
  • లక్షల క్యూసెక్కుల నీళ్లు సముద్రంలోకి కృష్ణా బేసిన్‌లోనూ వరద
  • మూడు రోజుల్లో ఈ ప్రాజెక్టులూ నిండే అవకాశం

హైదరాబాద్‌, నిజామాబాద్, గద్వాల, వెలుగు: ఎగువ నుంచి వస్తున్న వరదతో రెండు రోజుల్లోనే గోదావరి బేసిన్‌లోని ప్రాజెక్టులన్నీ నిండిపోయాయి. ప్రాజెక్టుల గేట్లు ఎత్తడంతో లక్షల క్యూసెక్కుల నీళ్లు సముద్రంలో కలిసిపోయాయి. మహారాష్ట్రతోపాటు రాష్ట్రంలోని క్యాచ్‌మెంట్‌ ఏరియాలో కురిసిన భారీ వర్షాలకు వాగులు, వంకలు ఉప్పొంగి గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఈనెల 21 ఉదయం దాకా ఎస్సారెస్పీకి 12 వేల క్యూసెక్కుల వరద మాత్రమే రాగా, ఆ మరుసటి రోజు 71 వేలకు పెరిగింది. కొన్ని గంటల్లోనే లక్షల క్యూసెక్కుల వరద పోటెత్తడంతో ప్రాజెక్టు పూర్తిగా నిండింది. దీంతో గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. ఈ ఫ్లడ్‌ ఇయర్‌లో మొదటి నుంచి ఎస్సారెస్పీకి ఆశాజనకమైన ప్రవాహాలు వచ్చాయి. ఇప్పటికీ 70 వేల క్యూసెక్కులకు పైగా ఇన్‌ఫ్లో  పోచంపాడులోకి వస్తోంది. ఎస్సారెస్పీ ఇంత త్వరగా నిండటం ప్రాజెక్టు నిర్మించిన తర్వాత ఇదే మొదటిసారి అని ఇంజనీర్లు చెప్తున్నారు.

గోదావరి బేసిన్‌లోని ప్రాజెక్టుల్లో ఎల్లంపల్లికే ఈ ఏడు అత్యధికంగా వరద వచ్చింది. కాళేశ్వరం లింక్‌ -1 నుంచి ఎత్తిపోసిన 32 టీఎంసీలను మినహాయిస్తే శనివారం ఉదయానికి ఈ ప్రాజెక్టుకు 105.56 టీఎంసీల నీళ్లు వచ్చాయి. ఆదివారం ఇన్‌ఫ్లోను కలుపుకుంటే ఇంకో 20 టీఎంసీల వరకు నీళ్లు అదనంగా ఎల్లంపల్లిని దాటి గోదావరిలోకి  చేరినట్టు లెక్క. ఏటా జులై, ఆగస్టు నెలల్లో ఎస్సారెస్పీతో సంబంధం లేకుండా ఎల్లంపల్లికి భారీ వరదలు వస్తున్నాయి. ఈ విషయం స్పష్టంగా తెలిసినా ప్రభుత్వం కోట్లాది రూపాయల కరెంట్‌ బిల్లు చెల్లించి కాళేశ్వరం నుంచి నీళ్లు ఎత్తిపోసింది. ఎల్లంపల్లి తర్వాత ఎస్సారెస్పీకి 103.37 టీఎంసీల నీళ్లు చేరాయి. మిడ్‌ మానేరు నుంచి ఎల్లంపల్లికి గేట్ల ద్వారా వదిలిన 11 టీఎంసీల నీళ్లు ఇప్పుడు సముద్రం పాలయ్యాయి. ఈనెల 22 వరకు ఎస్సారెస్పీలో 72 టీఎంసీల నీళ్లు, ఎల్లంపల్లిలో 19, మిడ్‌ మానేరులో 24, ఎల్‌ఎండీలో 22, కడెం ప్రాజెక్టులో 6.50 టీఎంసీల నీళ్లు ఉండగా అదే రోజు మధ్యాహ్నం తర్వాత అన్ని ప్రాజెక్టుల గేట్లు ఎత్తాల్సి వచ్చింది. ఎస్సారెస్పీ నుంచి 25 టీఎంసీలకు పైగా నీళ్లు వదిలేయగా, ఎల్లంపల్లి నుంచి 98 టీఎంసీలు దిగువకు వదిలారు.
శ్రీశైలం ప్రాజెక్టుకు 3.7 లక్షల క్యూసెక్కులు
కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది. పశ్చిమ కనుమల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ఆల్మట్టి డ్యాంకు 2.56 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. మూడున్నర లక్షల క్యూసెక్కులను గేట్లు, పవర్‌ హౌస్‌ల ద్వారా నదిలోకి వదులుతున్నారు. నారాయణపూర్‌కు 3.30 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, 3.41 లక్షల క్యూసెక్కులు.. జూరాలకు 3.5 లక్షల క్యూసెక్కులు వస్తుండగా 41 గేట్లు ఎత్తి 3.8 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. తుంగభద్ర డ్యాంకు లక్ష క్యూసెక్కులకు పైగా వరద వస్తోంది. ప్రవాహం ఇలాగే కొనసాగే అవకాశం ఉండటంతో రెండు రోజుల్లోనే ఈ ప్రాజెక్టు నిండి గేట్లెత్తే అవకాశముంది. శ్రీశైలం రిజర్వాయర్‌కు 3.70 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. ఈ ప్రాజెక్టులో 215.81 టీఎంసీల పూర్తి సామర్థ్యానికి గాను ప్రస్తుతం 93.58 టీఎంసీల నీళ్లు నిల్వ ఉన్నాయి. నాగార్జునసాగర్‌కు 29 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. ఈ ప్రాజెక్టులో 312.05 టీఎంసీలకు 182.13 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. కర్నాటకలోని ప్రాజెక్టులన్నీ నిండటంతో ఇకపై వచ్చే వరదంతా శ్రీశైలంలోకే చేరనుంది. వరద ఇలాగే కొనసాగితే మూడు రోజుల్లోనే ఈ రిజర్వాయర్‌ గేట్లు ఎత్తే అవకాశముంది.

ఎస్సారెస్పీ గేట్లు మూత
ఎగువ నుంచి ఇన్ ఫ్లో తగ్గడంతో శ్రీరాం సాగర్ ప్రాజెక్టు గేట్లను అధికారులు మూసివేశారు. ప్రస్తుతం ఇన్ ఫ్లో 49 వేల క్యూసెక్కులకు తగ్గింది. 22న ఉదయం రెండు గంటల్లోనే రికార్డు స్థాయిలో 10 లక్షల క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టులోకి వచ్చింది. మహారాష్ట్రలో వర్షాలు తగ్గుముఖం పట్టడం.. ఎగువ నుంచి వరద తగ్గడంతో ప్రాజెక్టు గేట్లు మూసివేశారు.