
Samantha on Divorce : 'ఏ మాయ చేశావే' చిత్రంతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి.. దక్షిణాదిలో టాప్ హీరోయిన్ గా గుర్తింపును సొంతం చేసుకుంది సమంత రూత్ ప్రభు . తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఉర్రూతలు ఊగించింది. తన వృత్తిలో, నిజ జీవితంలో సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగుతున్నారు. లేటెస్ట్ గా సమంత తన వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న సవాళ్లు, గుర్తింపు, దుర్బలత్వం వంటి అంశాలపై మనసు విప్పి మాట్లాడారు. ముఖ్యంగా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడటం వల్ల ఎదురయ్యే ట్రోలింగ్‌లు, విమర్శల గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.
పరిపూర్ణంగా లేను..
నా జీవితంలో ప్రతిదీ సరిగ్గా సెట్ కాలేదు. ఒక రకంగా చెప్పాలంటే పరిపూర్ణంగా లేను అని సమంత అన్నారు. తప్పులు చేయవచ్చు, తడబడవచ్చు. కానీ, నేను మెరుగ్గా మారడానికి ప్రయత్నిస్తున్నాను అని చెప్పారు. జీవితంలో ప్రతిదీ చక్కదిద్దుకున్నట్లుగా, పరిపూర్ణంగా ఉన్నట్లుగా చూపించుకోవడం తనకు ఇష్టం లేదని తెలిపారు. గుర్తింపు అనేది ఒక అంతిమ గమ్యస్థానం కాదని, అది నిరంతరంగా కొనసాగుతున్న ఒక ప్రక్రియ అని స్పష్టం చేశారు. తన జీవితంలో జరిగిన విడాకులు, మయోసైటిస్ వ్యాధి నుంచి బయటపడటం వంటివన్నీ- ప్రజలకు తెలుసని గుర్తు చేశారు. అందువల్ల, ఇతరుల జీవితాల గురించి కాకుండా, తాను తన సొంత జీవితం గురించి మాత్రమే నిజాయితీగా మాట్లాడగలనని చెప్పారు.
ట్రోలింగ్ పై సమంత ఆవేదన
నిజాయితీగా, దుర్బలంగా ఉండటం వల్ల ఎదురైన ట్రోలింగ్‌లు, విమర్శల గురించి సమంత ఆవేదన వ్యక్తం చేశారు. నా విడాకులు, అనారోగ్యం... ఇలా ప్రతీది ప్రజల ముందు ఉంది. మనం బలహీనంగా కనిపించినప్పుడు నిరంతరం జడ్జ్ చేస్తారు, ట్రోల్ చేస్తారు అని ఆమె తన బాధను పంచుకున్నారు. అయినప్పటికీ తన నిజమైన జీవితాన్ని పంచుకోవడానికి వెనుకాడలేదు, ఎందుకంటే ఇది నా సొంత ప్రయాణం అని చెప్పుకొచ్చారు. ప్రపంచంలో సెలబ్రిట్రీలు ఎలా జీవిస్తున్నారనేది అందరికీ తెలుసు. అలాంటి జీవితాన్ని ప్రతి ఒక్కరూ పొందలేరు. కాబట్టి సినీ ప్రముఖులైన తాము కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించడం ముఖ్యమని సూచించారు.
'ఊ అంటావా' పాట వెనుక సవాల్
'పుష్ప: ది రైజ్' చిత్రంలో తాను చేసిన సంచలన గీతం 'ఊ అంటావా మావా' పాట గురించి సమంత ఆసక్తికరంగా మాట్లాడారు. ఆ పాటను తాను ఒక సవాలుగా స్వీకరించి చేశానని వెల్లడించారు. నన్ను నేను ఎప్పుడూ సెక్సీగా భావించలేదు. నాకు ఎవరూ బోల్డ్ పాత్రలు ఇవ్వరని తెలుసు. అందుకే ఒక్కసారి ప్రయత్నించాను అని ఆమె వివరించారు. సెలబ్రిటీల జీవితం కూడా కష్టాలు, సవాళ్లతో కూడుకున్నదే అని వివరించారు.
కెరీర్ పై దృష్టి
తన కెరీర్ విషయంలోనూ మార్పులు చేసుకున్నట్లు సమంత తెలిపారు. ఇకపై ఎన్ని సినిమాలు చేశామనేది కాకుండా, ఎంత మంచి చిత్రాలు చేశామనేది ముఖ్యమన్నారు. అలాగే, శారీరక, మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించుకున్నానని, అందుకే గతంతో పోలిస్తే ఒకేసారి ఎక్కువ సినిమాలు చేయనని వెల్లడించారు. ప్రస్తుతం సమంత, దర్శకుడు ద్వయం రాజ్, డీకే తెరకెక్కిస్తున్న వెబ్ సిరీస్ 'రక్త్ బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్‌డమ్' లో నటిస్తున్నారు. అలాగే, ఆమె నటించబోయే రాబోయే తెలుగు సినిమా 'మా ఇంటి బంగారం' కూడా ఖరారైంది.